కేసీఆర్ సర్కార్ బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తం: చత్తీస్గఢ్

కేసీఆర్ సర్కార్ బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తం: చత్తీస్గఢ్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతోనే కరెంట్ కోతలు మొదలయ్యాయి. చత్తీస్ గఢ్ తో బకాయిల పంచాయితీ కారణంగా ఆ రాష్ట్రం విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. పాత బాకీలు చెల్లించే వరకు కరెంట్ సరఫరా చేసేది లేదని చత్తీస్ గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీఎస్‌పీడీసీఎల్‌) తేల్చి చెప్పింది. వచ్చే ఫైనాన్షియల్‌ ఇయర్‌ కోసం విద్యుత్ కేటాయింపులేమీ చేయకుండా చేతులెత్తేసింది. అయితే అదేమీ లెక్కలేనట్లుగా చత్తీస్‌గఢ్‌ తో చేసుకున్న రోజుకు వెయ్యి మెగావాట్ల ఒప్పందం మేరకు అందులో కనీసం 31 శాతం కరెంటు రావొచ్చని రాష్ట్ర డిస్కంలు అంచనా వేసుకున్నాయి. కానీ ఇప్పుడు అక్కడినుంచి అసలు విద్యుత్ వచ్చే అవకాశం లేకపోవడంతో కోతలు విధిస్తున్నాయి. ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్లుగా కరెంట్ సరఫరా చేసే పరిస్థితి లేదని డిస్కంలు అంటున్నాయి. 

జెన్‌‌కో నుంచి ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉందని, బయట కొందామంటే ఓపెన్‌‌ మార్కెట్‌‌లో ధరలు  భగ్గుమంటున్నాయని చెబుతున్నాయి. పాత ఒప్పందాల మేరకు చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి కొనాలనుకున్నా, బాకీలు కట్టేంత వరకు విద్యుత్ ఇచ్చేది లేదని సీఎస్‌‌పీడీసీఎల్‌‌ తేల్చేయటంతో ఆ దారులు కూడా మూసుకుపోయాయని అంటున్నాయి. కాగా, కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సబ్ స్టేషన్లను ముట్టడిస్తూ, రోడ్లను దిగ్బంధిస్తూ నిరసనలు తెలుపుతున్నారు.  

ఒప్పందంలో ఏముంది?

చత్తీస్‌‌గఢ్‌‌లోని మార్వా థర్మల్‌‌ విద్యుత్‌‌ కేంద్రం నుంచి 12 ఏండ్ల పాటు కరెంట్ కొనుగోలు కోసం తెలంగాణ డిస్కంలు, సీఎస్‌‌పీడీసీఎల్‌‌ మధ్య 2015 సెప్టెంబర్‌‌ 22న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగింది. టెండర్ల ద్వారా కాకుండా 2014 నవంబర్‌‌ 3న రెండు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగిన ఎంవోయూ ఆధారంగా ఈ ఒప్పందం జరిగింది. కరెంట్ సరఫరా కోసం వార్ధా–డిచ్‌‌పల్లి–మహేశ్వరం ట్రాన్స్‌‌మిషన్‌‌ లైన్‌‌ ను తెలంగాణ డిస్కంలు బుక్‌‌ చేసుకున్నాయి. దీని ప్రకారం కరెంట్‌‌ వచ్చినా రాకపోయినా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ట్రాన్స్‌‌మిషన్‌‌ చార్జీలు ప్రతి ఏటా వందల కోట్లు చెల్లించాల్సిందే. అగ్రిమెంట్ ప్రకారం తెలంగాణకు రోజుకు వెయ్యి మెగావాట్ల కరెంట్ చత్తీస్​గఢ్ నుంచి సరఫరా కావాలి. వార్ధా లైన్‌‌ కారిడార్‌‌ పూర్తయిన తర్వాత 2022 వరకు కరెంటు కొనుగోళ్లు జరిగాయి. ఆ తర్వాత ఆగిపోయాయి. అయితే ఇప్పుడు సరఫరా పునరుద్ధరించాలన్నా, బాకీల పంచాయితీతో అవకాశాలు లేకుండా పోయాయి. అంతమేరకు ఏ రోజుకారోజు షార్ట్ టెండర్ల ద్వారా విద్యుత్​ కొనుగోలు చేయలేకపోవడంతో కోతలు తప్పటం లేదని అధికారులు చెబుతున్నారు. 

బాకీ ఎంత? 

2022 జూన్‌ 3 నాటికి తెలంగాణ నుంచి తమకు రూ. 3,576 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చత్తీస్​గఢ్ అంటోంది. అవి చెల్లిస్తేనే ఒప్పందం ప్రకారం కరెంట్ ఇస్తామని సెప్టెంబర్‌ 23న రాష్ట్ర డిస్కంలకు అల్టిమేటం ఇచ్చింది. అప్పటి నుంచి కరెంట్ సరఫరా తగ్గిస్తూ వచ్చింది. అయితే తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.90 చొప్పున రూ.2,100 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని రాష్ట్ర డిస్కమ్ లు వాదించాయి. కానీ తమ రాష్ట్ర ఈఆర్సీ ఖరారు చేసిన మార్వా పవర్‌ ప్లాంట్‌ పెట్టుబడి వ్యయం ఆధారంగా చెల్లించాలని చత్తీస్ గఢ్ అంటోంది. చత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ ఉత్తర్వులతో పాటు పీపీఏ తుది అనుమతులను సవాల్‌ చేస్తూ తెలంగాణ డిస్కంలు అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటీ (అప్టెల్‌)లో కేసు వేశాయి.

ఏపీతో ఏండ్లుగా పంచాది.. 

రాష్ట్రం ఏర్పడినంక తెలంగాణ విద్యుత్‌‌ సంస్థలు ఏపీ జెన్‌‌కో నుంచి కరెంట్ కొనుగోలు చేశాయి. 2017 వరకు కరెంట్ సరఫరా చేసిన ఏపీ.. ఆ తర్వాత నిలిపివేసింది. అప్పటి వరకు తెలంగాణ డిస్కంలు వాడుకున్న కరెంటు బాకీ రూ.3,441.78 కోట్లు అని ఏపీ ప్రభుత్వం అంటోంది. అయితే ఏపీ జెన్‌‌కోనే తమకు రూ.12,532 కోట్లు బాకీ ఉందని, అందులో నుంచి అవి తీసేసి మిగతావి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఏపీలోని అనంతపురం, కర్నూల్‌‌ జిల్లాలకు ఎక్కువ ఖర్చుతో థర్మల్ పవర్ కొని సరఫరా చేశామని.. ఆ డ్యూస్‌‌, వడ్డీ కలిపి ఏపీ డిస్కంలు చెల్లించాల్సి ఉందని చెబుతోంది. ఆ బకాయిలు  2021 డిసెంబర్‌‌ 31 నాటికే రూ.11,248 కోట్లు అని, 10.50 శాతం వడ్డీ రూ.6,579 కోట్లు కలిపి మొత్తం రూ.17,828 కోట్లు బాకీ ఉందని పేర్కొంటోంది. ఇందులో నుంచి తాము చెల్లించాల్సిన రూ.3,442 కోట్లు, వడ్డీ రూ.1,446 కోట్లు కలిపి మొత్తం రూ.4,887 కోట్లు తీసేస్తే.. ఏపీనే రూ.12,940 కోట్లు చెల్లించాల్సి ఉందని అంటోంది. కాగా, ఈ వివాదం ఇలా ఉండగా రాష్ట్ర సర్కార్ తాజా బడ్జెట్‌‌లో రూ.17 వేల కోట్లు ఏపీ నుంచి కరెంటు బకాయిలు రావాల్సి ఉందని ఆదాయంలో పేర్కొనడం గమనార్హం.