డేంజరస్‌‌ వికెట్‌‌పై టెస్టు ఆడినట్లుంది..కరోనాపై గంగూలీ

డేంజరస్‌‌ వికెట్‌‌పై టెస్టు ఆడినట్లుంది..కరోనాపై గంగూలీ

న్యూఢిల్లీపిచ్‌‌‌‌పై బాల్‌‌‌‌ వేగంగా దూసుకోస్తోంది.. టర్న్‌‌‌‌ కూడా బాగా అవుతోంది.. బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ తప్పులు చేయకుండా ఆడటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి.. ఆడకపోతే ప్రమాదం.. ఆడితే ఔటయ్యే చాన్స్‌‌‌‌.. ఇలాంటి భయంకరమైన వికెట్‌‌‌‌పై టెస్ట్‌‌‌‌ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందో.. కరోనా వల్ల మన పరిస్థితి అలా తయారైందని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ అన్నాడు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో దేశ వ్యాప్తంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కరోనా మహమ్మారి దేశాన్ని ఎంత గందరోళ పరిస్థితుల్లోకి నెట్టిందో చూస్తున్నాం. బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌కు చాలా తక్కువగా సహకరించే డేంజరస్‌‌‌‌ వికెట్‌‌‌‌పై టెస్ట్‌‌‌‌ ఆడితే ఎలా ఉంటుందో అలా తయారైంది పరిస్థితి. ఈ స్థితిలో తనకు ఉన్న స్వల్ప అవకాశాలను ఉపయోగించుకుంటూ, వికెట్‌‌‌‌ను కాపాడుకుంటూ రన్స్‌‌‌‌ చేసి తీరాలి. లేదంటే పెద్ద ప్రమాదంలో పడినట్లే. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు. కానీ అందరం కలిసి ప్రయత్నిస్తే ఏదో ఓ దశలో విజయం సాధిస్తామనే నమ్మకంతో ముందుకెళ్లాల్సిందే. ప్రస్తుత పరిస్థితులు చాలా బాధ కలిగిస్తున్నాయి. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంకోపక్క కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ పరిస్థితి మరింత ఆందోళన పెంచుతున్నది. ఈ మహమ్మారి ఎక్కడి నుంచి ఎప్పుడు, ఎలా వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. ఇలా జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేదు’ అని దాదా పేర్కొన్నాడు.

ఎవర్ని చూసినా భయమే..

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవర్ని చూసినా, ఎవర్ని కలవాలన్నా భయం వేస్తుందని గంగూలీ అన్నాడు. ‘కరోనాతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో ప్రతి ఒక్కర్ని అనుమానించాల్సి వస్తోంది. ఇంటికి సరుకులు డెవిలిరీ చేసే వాళ్లను చూసినా భయమే వెంటాడుతున్నది. దగ్గర్లో ఉన్న వ్యక్తులను కలవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. మొత్తానికి ఇదో మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఫీలింగ్‌‌‌‌. వీలైనంత త్వరగా పరిస్థితి అదుపులోకి వస్తే బాగుండు’ అని సౌరవ్‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఓ క్రికెటర్‌‌‌‌గా రియల్‌‌‌‌ లైఫ్‌‌‌‌లో హైప్రెజర్‌‌‌‌ పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొన్నానని వెల్లడించిన దాదా.. క్రికెట్‌‌‌‌ నేర్పిన పాఠాల వల్ల పాజిటివ్‌‌‌‌గా ఉండగలుగుతున్నానని చెప్పాడు. ఒక్క చెత్త షాట్‌‌‌‌ వల్ల మళ్లీ ఆడే చాన్స్‌‌‌‌ వస్తుందో లేదో తెలియని పరిస్థితులను దాటడం వల్లే ఇప్పుడు అలెర్ట్‌‌‌‌గా ఉండగలుగుతున్నానని తెలిపాడు. అయితే లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పుణ్యమాని ఫ్యామిలీతో ఎక్కువ టైమ్‌‌‌‌ స్పెండ్‌‌‌‌ చేసే అవకాశం దక్కిందన్నాడు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నాడు.