యూజర్ ఎక్స్‌పీరియెన్స్ ఈజీగా ఉంచటంతో పాటు వాళ్ల సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది యాపిల్ కంపెనీ. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐఓఎస్16 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని తీసుకొచ్చింది. అలానే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఉబర్ కంపెనీలు కూడా కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్స్ తెస్తున్నాయి. వాటి గురించి..
యాపిల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రైవసీ, సెక్యూరిటీ. అయితే, ఈ ఐఓఎస్ 16 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో సెక్యూరిటీతో పాటు, కొన్ని కస్టమైజబుల్ ఫీచర్లని తెచ్చింది. ఈ అప్‌డేట్ ఐఫోన్ 8 సిరీస్ నుంచి 13 సిరీస్‌లకు వస్తుందని చెప్పింది యాపిల్.
- వాల్‌పేపర్‌ను నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే వాల్‌పేపర్‌పైన ఉండే ఫొటోను హైలైట్ చేసి పెద్దగా పెట్టుకోవచ్చు. టైమర్‌ను నచ్చిన కలర్, సైజ్, డిజైన్‌లో కస్టమైజ్ చేసుకోవచ్చు. థీమ్స్‌ను కూడా కావాల్సినట్టు ఎడిట్ చేసి, వాల్‌పేపర్‌గా పెట్టుకోవచ్చు.
- స్క్రీన్ పైన, హోమ్ బటన్ దగ్గర సెర్చ్ బార్ యాడ్ చేశారు. దాన్నుంచి కావాల్సిన యాప్‌తోపాటు గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు.
- ఫొటోలు ఎవరెవరికి షేర్ చేసామన్నది కూడా ఇప్పుడు గ్యాలరీలో చూపిస్తుంది. హైడ్ చేసిన ఫొటోలకు ఇప్పుడు లాక్ పెట్టుకోవచ్చు.
- బ్యాటరీ ఇండికేషన్ బార్‌లో బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్‌ని యాడ్ చేశారు. అప్పుడప్పుడు లో ఓల్టేజ్, హై ఓల్టేజ్ కరెంట్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఛార్జింగ్ పెడితే బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అప్‌డేట్ ద్వారా బ్యాటరీ డ్యామేజ్‌ని కొంత తగ్గించొచ్చు.
- టెక్స్ట్ మెసేజ్‌లో అన్‌డు, ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ని తీసుకొచ్చింది యాపిల్. టెక్స్ట్ మెసేజ్ పంపిన పావుగంటలోపు ఆ మెసేజ్‌ని అన్‌డు లేదా డిలీట్ చేయొచ్చు. కాకపోతే ఈ ఫీచర్ పనిచేయాలంటే మెసేజ్ చేసిన వాళ్ల ఫోన్‌లో, రిసీవ్ చేసుకున్నవాళ్ల ఫోన్‌లో ఐఓఎస్ 16 ఉండాలి.
- కొత్తగా మెడికేషన్ యాప్‌ని ప్రి ఇన్‌స్టాల్ చేసుకునే ఫెసిలిటీ తెచ్చింది. దాంట్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సేవ్ చేసుకోవచ్చు. రిమైండర్‌లో ఏ టైంకి ఏ మెడిసిన్ వేసుకోవాలో సేవ్ చేసి ఉంచితే, ఆ టైంకి అలర్ట్ మెసేజ్‌లు ఇస్తుంటుంది.
- ఇదివరకు యాపిల్ వాలెట్‌లో ఫైల్స్, టికెట్స్, బిల్స్ సేవ్ చేసేవాళ్లు. ఈ అప్‌డేట్‌లో ఆర్డర్ ట్రాకింగ్‌ని తెచ్చింది. అంటే ఏ యాప్‌లో ఆర్డర్ పెట్టినా డైరెక్ట్ వాలెట్ నుంచి ట్రాక్ చేయొచ్చు.
యూట్యూబ్ యాడ్స్ మరిన్ని
యూట్యూబ్‌లో ఏదైనా వీడియో చూస్తున్న ప్పుడు మధ్యలో యాడ్స్ వచ్చి విసిగిస్తుం టాయి. వాటిలో కొన్నింటిని స్కిప్ చేయొచ్చు. కొన్నింటికి స్కిప్ చేసే ఆప్షన్ ఉండదు. అయితే, ఇప్పుడు 12 సెకండ్లతో మొత్తం 5యాడ్‌లను వరుసగా ఇవ్వబోతోంది యూట్యూబ్. అవి కూడా స్కిప్ చేసే ఆప్షన్ లేకుండా. యూట్యూబ్ ఛానెల్స్ పెరగడంతో వాటికి రెవెన్యూని ఇవ్వడానికే యాడ్స్ పెంచుతున్నాం అంటోంది యూట్యూబ్ మేనేజ్‌మెంట్. యాడ్ ఫ్రీ వీడియోల కోసం ప్రీమియం తీసుకోవాలని చెప్తున్నారు.
లాస్ట్ సీన్ కొందరికే..
వాట్సాప్ ఇప్పుడు కొత్తగా లాస్ట్ సీన్ ఫీచర్‌ని అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌లో స్టేటస్ ఆప్షన్‌లో ఉన్నట్టు లాస్ట్ సీన్‌ని ఎవరెవరు చూడొచ్చు, ఎవరికి కనిపించొద్దనే ఆప్షన్స్ వచ్చేశాయి. అంతేకాకుండా వాట్సాప్ మెసేజ్‌లను డేట్‌వైజ్ సెర్చ్ చేసే ఫీచర్‌ని కూడా తెచ్చింది. టైపింగ్ బార్‌లో క్యాలెండర్ ఉంటుంది. దాంట్లో డేట్ సెలక్ట్ చేసి సెర్చ్ చేస్తే, ఆ డేట్‌లో చాట్ చేసిన మెసేజ్‌లన్నీ వస్తాయి.
