పోలీసు ఉద్యోగాల భర్తీలో..కటాఫ్ లొల్లి

పోలీసు ఉద్యోగాల భర్తీలో..కటాఫ్ లొల్లి

హైదరాబాద్, వెలుగు:  ఎస్‌‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ మార్కుల కంటే, ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థుల కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 587 సబ్ ఇన్‌‌స్పెక్టర్,16,604 కానిస్టేబుల్‌‌ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షల మంది యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దీంతో ఈ నోటిఫికేషన్‌‌కు ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లు వర్తించబోవని బోర్డు పేర్కొంది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌ వరకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు. కానీ, ఫైనల్ ఎగ్జామ్‌‌కు ముందట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్‌‌లో సవరణలు చేశారు. 

పది శాతం పోస్టులను ఈడబ్ల్యూఎస్‌‌ కింద కేటాయించారు. ఫైనల్ ఎగ్జామ్‌‌కు సంబంధించిన ఫలితాలను మూడ్రోజుల క్రితమే బోర్డు విడుదల చేసింది. ప్రతి జిల్లాలోనూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి. 
బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ తక్కువగా ఉంది. ప్రతి జిల్లా, ప్రతి కమిషనరేట్‌‌లోనూ అత్యల్ప కటాఫ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులదే ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తక్కువ మంది ఉండడం, వారికి కేటాయించిన పోస్టులు ఎక్కువగా ఉండడం వల్లే వారి కటాఫ్ తక్కువగా ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు చెబుతున్నారు. 

పరస్పర విమర్శలు

కటాఫ్ మార్కులను బట్టి చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లపై విమర్శలు చేస్తున్నారు. రెండు శాతం మంది పేదలు కూడా లేని ఓసీలకు, పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. జనాభా లెక్కలు తేల్చకుండా అశాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలకు ఓసీలు సోషల్ మీడియా వేదికగానే కౌంటర్లు పెడుతున్నారు. ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లు ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. తెలంగాణలో ఓసీలు 23 శాతం ఉన్నారని, పది శాతంగా ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 23 శాతానికి పెంచాలని ఆ వర్గం వారు ఫేస్‌‌బుక్‌‌లో పోస్టులు పెడుతుండగా.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము కూడా  సిద్ధమేనని బీసీ వర్గం వారు కామెంట్స్ పెడుతున్నారు. కులాల వారీగా జన గణనకు ఓసీలు డిమాండ్ చేయాలని చాలెంజ్ చేస్తున్నారు.