పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ? మెదడులో సమస్య కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ? మెదడులో సమస్య కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!
  • పిల్లల్లో పెరుగుతున్న సీవీఐ సమస్య
  • మెదడులో ప్రాసెసింగ్ కేంద్రాలు దెబ్బతినడం వల్ల వచ్చే అనర్థం  
  • కొన్ని లక్షణాలుంటే పరీక్షలు చేయించాలి: ఎల్వీ ప్రసాద్ రిహాబిలిటేషన్ థెరపిస్ట్ భారతి అంపోలు

హైదరాబాద్​సిటీ, వెలుగు : పిల్లల్లో దృష్టి లోపాలకు దారితీసే ‘కార్టికల్,సెరెబ్రల్ విజువల్ ఇంపెయిర్‌‌‌‌మెంట్’ (సీవీఐ) ప్రస్తుతం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందని ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ రిహాబిలిటేషన్ థెరపిస్ట్ భారతి అంపోలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంట్లో లోపం లేకపోయినా, మెదడులో చూపునకు సంబంధించిన ప్రాసెసింగ్ కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందన్నారు.  

పుట్టడానికి ముందు, పుట్టిన తర్వాత మెదడుకు గాయమైతే సీవీఐ ఏర్పడవచ్చన్నారు. మెదడుకు ఆక్సిజన్ లేదా రక్త సరఫరా తగ్గిపోవడం, తరచూ స్ట్రోక్ కారణంగా మెదడులో ద్రవం అధికంగా చేరడం, మెదడుకు వ్యాపించే ఇన్‌‌‌‌ఫెక్షన్లు, తలకు గాయం‌‌‌‌, ముందస్తు ప్రసవం , కొన్ని జన్యు, మెటబాలిక్ లేదా క్రోమోజోమల్ సమస్యల వల్ల ఈ సమస్య వస్తుందన్నారు. 

చూసే వస్తువులకు స్పందించడానికి ఎక్కువ టైం తీసుకోవడం, ముందున్న వస్తువును పూర్తిగా కాకుండా కొన్ని భాగాలనే గమనించడం, ముఖాలు, వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది పడడం, చుట్టూ చాలా వస్తువులు ఉన్నప్పుడు గుర్తించడం కష్టంగా అనిపించడం, చూస్తున్న వస్తువుల వైపు చేతులు చాపడంలో ఇబ్బంది పడడం, దృశ్య సంకేతాలకు నెమ్మదిగా స్పందించడం, స్థిరంగా ఉన్న వాటికన్నా కదిలే వస్తువులను సులభంగా గమనించడం, నేరుగా కాకుండా పక్క దృష్టితో చూడడాన్ని ఇష్టపడడం, వస్తువులను చూడటానికి అదనపు సమయం తీసుకోవడం, ప్రకాశవంతమైన లేదా కొన్ని నిర్దిష్ట రంగులను ఎక్కువగా ఇష్టపడడం, ఎక్కువగా చూసే పనుల వల్ల త్వరగా అలసిపోవడం, దృష్టి సామర్థ్యం ఒక రోజు ఒకలా, మరో రోజు మరోలా మారుతూ ఉండడం గమనిస్తే కంటి డాక్టర్​తో పాటు న్యూరాలజిస్ట్, డెవలప్‌‌‌‌మెంటల్ పీడియాట్రిషన్, విజన్ థెరపిస్ట్‌‌‌‌లతో పరీక్షలు చేయించుకోవాలన్నారు.