
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2024, జూన్ 8వ తేదీ శనివారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ కీలక కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్విందర్ సింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తదితర కీలక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేతను ఎన్నుకోవడంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ సీటును, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానాల్లో ఘన విజయం సాధించిన రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు.
సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకునేందుకు సీడబ్ల్యుసీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా నాయకత్వం వహించడానికి రాహుల్ సరైన వ్యక్తి అన్నారు. దీనిపై త్వరలోనే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సీడబ్ల్యుసీ మీటింగ్ ను పొడిగించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం, గ్యారంటీలపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. ఎన్నికల సమయంలో బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసినా, కాంగ్రెస్ నేతలను బెదిరించినా.. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చామన్నారు. రాజ్యాంగం, ప్రజస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు యోధుల్లా పోరాడారని కేసీ వేణుగోపాల్ అన్నారు.