కీసర, వెలుగు: సీఐ పేరుతో ఫోన్ చేసి పెట్రోల్ బంక్ మేనేజర్ వద్ద ఓ సైబర్ చీటర్ డబ్బులు కొట్టేశాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగారం వై ఎస్ ఆర్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లో హనుమంత్ రావు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయనకు సీఐ సురేశ్‌కుమార్ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. తాను కీసర సీఐ లక్ష్మణ్ అని పరిచయం చేసుకున్నాడు. రూ.20 వేలు ఫోన్ పే చేయాలని, సాయంత్రం తన మనిషి వచ్చి డబ్బులు ఇస్తాడని నమ్మించాడు. దీంతో బంక్ మేనేజర్ గుర్తు తెలియని ఆ ఫోన్ నంబర్ కి రూ.20 వేలు ఫోన్ పే ద్వారా పంపించాడు. సాయంత్రం ఎవరూ డబ్బులు తెచ్చి ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. గురువారం ఉదయం కీసర పోలీస్ స్టేషన్లో బాధితుడు హనుమంత్ రావు ఫిర్యాదు చేశాడు.సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.

