
బషీర్బాగ్, వెలుగు: ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ టీమ్ అంటూ ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. ఎస్ఆర్ నగర్ కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, తన ఫోన్ పే లో సమస్య రావడంతో గూగుల్‌లో ఫోన్ పే కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేశారు. సైబర్ చీటర్స్ పోస్ట్ చేసిన నెంబర్‌ను, కస్టమర్ కేర్ నెంబర్ అనుకొని వృద్ధుడు ఆ నెంబర్ కు ఫోన్ కాల్ చేశాడు.
లైన్ లోకి వచ్చిన స్కామర్స్ ఫోన్ పే సపోర్ట్ టీమ్ అంటూ మాటలు కలిపారు. స్కామర్స్ ఫోన్ పే అప్లికేషన్ ను ఓపెన్ చేయాలని సూచించి, బాధితుడి బ్యాంక్ అకౌంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాసేపటికి పలు అనధికార లావాదేవీలు జరిగినట్లు మెసేజ్ వచ్చింది. మొత్తం రూ. 4.20 లక్షలు పోగొట్టుకున్నట్లు, బాధిత వృద్ధుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. వృద్ధుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.