టూర్స్ & ట్రావెల్స్ పేరిట సైబర్ మోసం.. రూ.20 వేలు హాంఫట్

టూర్స్  & ట్రావెల్స్ పేరిట సైబర్ మోసం.. రూ.20 వేలు హాంఫట్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దైవ దర్శనం టికెట్ పేరిట ఆన్ లైన్ మోసం బయటపడింది. కల్కీనగర్ కాలనీకి చెందిన గట్టు విజయలక్ష్మి అనే టీచర్ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి హెలిక్యాప్టర్ టికెట్ కోసం ఆన్ లైన్ లో వెతికారు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో టూర్స్ & ట్రావెల్స్ పేరిట టికెట్ బుక్ చేస్తామని సైబర్ కేటుగాళ్లు విజయలక్ష్మిని నమ్మించారు. టికెట్ బుక్ చేస్తామని ఓటీపీని పంపి, మాయా మాటలు చెప్పారు.

సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన ఆ మహిళ మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీని వారికి షేర్ చేశారు. ఓటీపీని రిసీవ్ చేసుకున్న కేటుగాళ్లు.. అదే అదనుగా భావించి ఆ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.20వేలు దోచేశారు. మనీ కట్ అయినట్టుగా ఆ టీచర్ ఫోన్ కు మెసేజ్ రావడంతో.. మోసపోయానని గ్రహించారు. వెంటనే స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దేవునిపల్లి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.