సైబర్ సేఫ్టీపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు అత్యాశకు పోయి, మరికొందరు అవగాహన లేక డబ్బులు కోల్పోతున్నారు. చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నారు. ప్రజల అత్యాశను అవకాశంగా మల్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా టాస్క్-బేస్డ్ సంపాదన అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఇంట్లోనే ఉంటూ సులభంగా డబ్బు సంపాదించవచ్చు అంటూ ఆశ చూపించి జనాన్ని నిండా ముంచుతున్నారు. ఇంట్లోనే ఉండి యూట్యూబ్ వీడియోల లైక్ చేయడం, ఇ-కామర్స్ సైట్‌లలో ప్రొడక్ట్స్‌కు రేటింగ్ ఇవ్వడం, సోషల్ మీడియా ఖాతాలను అనుసరించడం, పోస్టులకు చిన్న సమీక్షలు రాయడం ద్వారా డబ్బు సంపాదించొచ్చు అంటూ జనాన్ని దోచేస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్-బేస్డ్ సంపాదన మోసాలకు వ్యతిరేకంగా సైబర్ పోలీసులు మరోసారి అవగాహన కల్పించారు.
ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ వీడియోల లైక్ చేయడం, ఇ-కామర్స్ సైట్‌లలో ప్రొడక్ట్స్‌కు రేటింగ్ ఇవ్వడం, సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడం, పోస్టులకు చిన్న సమీక్షలు రాయడం ద్వారా ఈజీ డబ్బు సంపాదించొచ్చు అంటూ మోసగాళ్లు మీకు ఆశ చూపిస్తారు. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెల్‌ల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటూ ప్రచారం చేస్తారు. మొదట మిమ్మల్ని నమ్మించడానికి కొన్ని డబ్బులు కూడా ఇస్తారు.
ఆ తర్వాత మీకు డబ్బులు ఇంకా ఎక్కువ వచ్చే పని కల్పిస్తామని.. ఇందుకు కొన్ని డబ్బులు చెల్లించాలని ఆడుగుతారు. ఇటువంటి టాస్క్-బేస్డ్ సంపాదన అవకాశాలను ప్రకటించే టెలిగ్రామ్ లేదా వాట్సాప్ సందేశాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని UPI IDలు లేదా QR కోడ్‌లకు డబ్బును బదిలీ చేయొద్దని ప్రజలకు సూచించారు సైబర్ పోలీసులు. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలనుకునే వారు సులభంగా రాబడిని ఇస్తామని హామీ ఇచ్చే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఈ మోసాలు ఆర్థిక నష్టానికి దారి తీస్తాయని హెచ్చరించారు.
సైబర్ సేఫ్టీ అధికారుల సూచనలు:
- ధృవీకరించని సోషల్ మీడియా సందేశాల ఆధారంగా ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి.
- తక్కువ పని ఎక్కువ రాబడి అంటూ హామీ ఇచ్చే ఉద్యోగాలను నమ్మకండి
- ఉద్యోగం చేసే కంపెనీ వివరాలను అధికారికంగా ధృవీకరించుకోండి
- వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోండి
- ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ (1930)కు నివేదించండి లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.
