యుద్ధాల్లో కంటే.. రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మృతులు

యుద్ధాల్లో కంటే.. రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మృతులు
  • సైబరాబాద్ సీపీ ఎం. రమేశ్ 
  • ఘనంగా సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం
  • పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన సీపీ

గచ్చిబౌలి, వెలుగు: టెక్నాలజీని వినియోగిస్తూ ఆధునిక పోలీసింగ్​లో సైబరాబాద్ కమిషనరేట్ దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని సీపీ డా. ఎం. రమేశ్ తెలిపారు. గురువారం సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గచ్చిబౌలిలోని కమిషనరేట్​లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సైబరాబాద్ ప్రాంత అభివృద్ధిలో పోలీసుల కష్టం, స్వేదం, త్యాగం కీలక పాత్ర పోషించాయన్నారు.

టెక్నాలజీ ఆధారిత కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్, సైబర్ క్రైమ్ దర్యాప్తులు, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, పబ్లిక్ -ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని, ప్రొఫెషనల్ నైపుణ్యాలకు జాతీయ స్థాయి పురస్కారాలు లభించాయని తెలిపారు.

 సైబర్ నేరాలు, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని, యుద్ధాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుండడం ఎంతో బాధాకరమన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అంతకు ముందు సీపీ తన ఆఫీస్​ ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం ధీర, వీర, ధృవ, భీమ, రాఖీ, తేజ, మౌని, లైకా పోలీసు జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నార్సింగి పోలీసులతో కలిసి సైక్లింగ్ ట్రాక్​పై సీపీ, పోలీసు అధికారులు సైక్లింగ్ చేశారు. కార్యక్రమంలో కూకట్​పల్లి డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి డీసీపీ సీ.హెచ్. శ్రీనివాస్, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, ట్రాఫిక్-1 డీసీపీ రంజన్ రతన్ కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్  పాల్గొన్నారు.