V6 News

వీడలేనంటు..వీడుకోలంటు!...రిటైర్మెంట్ వేళ సీపీ సుధీర్ బాబు కన్నీళ్లు!

వీడలేనంటు..వీడుకోలంటు!...రిటైర్మెంట్ వేళ సీపీ సుధీర్ బాబు కన్నీళ్లు!
  •     ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం
  •     ఫ్యూచర్ సిటీ కమిషనర్ భావోద్వేగం
  •     బాధ్యతగా పనిచేస్తే ఫలితాలు అవే వస్తాయని సిబ్బందికి సూచన

ఇబ్రహీంపట్నం, వెలుగు: సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో ఎన్నో చిక్కుముడులను విప్పి, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ సుధీర్ బాబు బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్​లో బుధవారం నిర్వహించిన వేడుకల్లో పోలీసు అధికారులు ఆయనను ఘనంగా సన్మానించి, గౌరవ వందనం సమర్పించారు. 

వీడ్కోలు సభలో ఆయన తన 31 ఏండ్ల సర్వీసును గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం మధ్యలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది కష్టం వల్లే రాచకొండ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు నంబర్ వన్ స్థానంలో నిలిచాయన్నారు. పదవీ విరమణ అనేది ఉద్యోగంలో సహజమని, కానీ మన సేవల వల్ల ప్రజలకు ఎంత మేలు జరిగిందన్నదే ముఖ్యమన్నారు. బాధ్యతగా పనిచేస్తేనే మంచి ఫలితాలు దానంతటవే వస్తాయని, నాలుగు కమిషనరేట్లలో కమిషనర్​గా పనిచేసే అరుదైన అవకాశం తనకు దక్కిందని గుర్తు చేసుకున్నారు.

సుధీర్ బాబు ప్రస్థానం..

2001 ఐపీఎస్​బ్యాచ్​కు చెందిన సుధీర్ బాబు 1966 ఏప్రిల్ 15న జన్మించారు. తన కెరీర్​లో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా, విజయవాడ డీసీపీగా, హైదరాబాద్ డీసీపీగా, టాస్క్ ఫోర్స్ డీసీపీగా సేవలు అందించారు. అలాగే ఎస్ఎఆర్ సీపీఎల్ కమాండెంట్​గా, అల్వాల్, శంషాబాద్, వెస్ట్ జోన్, ట్రాఫిక్ డీసీపీగా, మహబూబ్​నగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్​గా, రాచకొండ జాయింట్ సీపీ (డీఐజీ హోదా), ఐజీపీగా రాచకొండ అదనపు సీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ, మల్టీ జోన్-II ఐజీ, రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్​గా ఆధునిక పోలీసింగ్ విధానాలను అమలు చేస్తూ, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు పోలీసులను చేరువ చేశారు.

అవార్డులు.. అంతర్జాతీయ శిక్షణ

ఆయన ప్రతిభను గుర్తిస్తూ 2012లో ‘ఇండియన్ పోలీస్ మెడల్’, 2025లో ప్రతిష్టాత్మకమైన “అతి ఉత్కృష్ట సేవా పథకం” అవార్డులు లభించాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్, బ్రిటిష్ పోలీస్ సంస్థల వద్ద ఆయన శిక్షణ పొందారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ చందనా దీప్తి, డీసీపీలు నారాయణ రెడ్డి, యోగేష్ గౌతమ్, సిరీష సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.