గచ్చిబౌలి, వెలుగు: సైబర్ క్రిమినల్స్‌తో బ్యాంకు అధికారులు కుమ్మక్కయ్యారు. ఎలాంటి వెరిఫికేషన్లు లేకుండానే సైబర్ క్రిమినల్స్ కోసం బ్యాంకు అకౌంట్స్ తెరిచి, కమీషన్ పద్ధతితో సరఫరా చేస్తున్నారు. ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో సైబర్ క్రిమినల్స్‌తో మిలాఖత్ అయిన ఏడుగురు బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో సిటీలోని ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అనుష (30), కూకట్పల్లి ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మూడవత్ దినేష్ చౌహన్ (34), రెండో కేసులో... ప్రగతినగర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ మేనేజర్ నదీష్ సంబార్, మూడో కేసులో హైదరాబాద్ బంధన్ బ్యాంక్ మాజీ ఫీల్డ్ అధికారి రెనికుంట మహేష్ (37), నాలుగో కేసులో హైదరాబాద్ జేఎన్టీయూ ఇండస్ఇండ్ బ్యాంక్ ఫీల్డ్ అధికారి రెడ్డి హరీష్, బ్యాంక్ సేల్స్ మేనేజర్ ఎన్. రవి, ఐదో కేసులో హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గొనెల సాయి వెంకట్ (29) ఉన్నారు.
వీరు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడంలో సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి రూల్స్ పాటించకుండానే అకౌంట్స్ ఓపెన్ చేయడం, తమ కమీషన్ తీసుకొని అకౌంట్స్ ద్వారా అధిక డబ్బు లావాదేవీలు జరిగేలా చూసినట్లు పేర్కొన్నారు.

