‘ఈబిజ్’ ఎండీ అరెస్ట్

‘ఈబిజ్’ ఎండీ అరెస్ట్
  • ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్​ పోలీసులు
  • మల్టీ లెవల్​ మార్కెటింగ్, ఈ-లెర్నింగ్ పేరుతో మోసాలు
  • 17 లక్షల మంది నుంచి రూ.5 వేల కోట్ల వసూలు
  •  సంస్థకు చెందిన రూ.389 కోట్ల అకౌంట్లు సీజ్

హైదరాబాద్, వెలుగుఈ–-లెర్నింగ్ పేరిట మల్టీలెవల్​ మార్కెటింగ్​ ద్వారా మోసాలకు పాల్పడిన ‘ఈ-బిజ్​డాట్​ కామ్​ ప్రైవేట్​ లిమిటెడ్’​మేనేజింగ్​ డైరెక్టర్ పవన్​ మల్హాన్(62), అతని కుమారుడు హితిక్​ మల్హాన్(31)లను సైబరాబాద్​ పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. ఈ-బిజ్​ అక్రమాలపై పలువురు బాధితులు మార్చిలో సైబరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా 17 లక్షల మంది నుంచి రూ.5 వేల కోట్ల మోసానికి మల్హాన్​ఫ్యామిలీ పాల్పడినట్లు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ గుర్తించింది. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న పవన్, హితిక్​లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రూ.389 కోట్ల ఈ-బిజ్‌ బ్యాంక్ నిల్వలను ఫ్రీజ్ చేశారు.

రూ.5 వేల కోట్ల వసూళ్లు

ఉత్తర్ ప్రదేశ్ నోయిడా కేంద్రంగా ఈ-బిజ్ సంస్థ పనిచేస్తోంది. ఎండీగా పవన్ మల్హాన్, డైరెక్టర్​గా అతని భార్య అనితా మల్హాన్ కొనసాగుతున్నారు. సంస్థ కార్యకలాపాలను వీళ్ల కుమారుడు హితిక్ మల్హాన్ చూస్తున్నాడు. మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ ల పేరుతో స్టూడెంట్లను ఈ-లెర్నింగ్, నిరుద్యోగులు, మహిళలను క్లాత్ బిజినెస్ వంటి ఆకర్షణీయమైన వ్యాపారాల పేరుతో ట్రాప్ చేశారు. స్టార్​ హోటళ్లలో సెమినార్లతో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. మెంబర్ షిప్ కోసం రూ.16,821 వసూలు చేశారు. వారికి ఈ-లెర్నింగ్ ప్రాజెక్ట్ లో స్టేజీల ప్రకారం టార్గెట్​లు పెట్టారు. టార్గెట్​రీచ్ అయితే ఆకర్షణీయమైన బహుమతులు, ఫారిన్ ట్రిప్పులు అంటూ ఆశ చూపించారు. చైన్ సిస్టమ్ లో సభ్యులను చేర్పించిన వారికి రూ.2,700 నుంచి రూ.25 వేల వరకు కమీషన్ చెల్లించేవారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం అంటూ సంస్థ చేసిన ప్రచారంతో సభ్యుల సంఖ్య లక్షలకు చేరింది. ఇలా దేశవ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది నుంచి రూ.5 వేల కోట్లు వసూలు చేసింది. వీరిలో హైదరాబాద్, కర్నాటక, తమిళనాడు, కాశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవాకు చెందిన బాధితులు ఉన్నారు. ఈ-బిజ్​ అక్రమాలపై ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో హితిక్​ మల్హాన్​ను పోలీసులు అరెస్ట్ చేసి.. విచారించారు. అయితే ఆ తర్వాత అతడు దర్యాప్తునకు సహకరించకుండా పారిపోయాడు.