సైబరాబాద్​ షీ టీంకు ఫిర్యాదుల వెల్లువ

సైబరాబాద్​ షీ టీంకు ఫిర్యాదుల వెల్లువ

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ షీ టీంకు మే నెలలో వేధింపులు, బ్లాక్​మెయిలింగ్​కు సంబంధించిన ఫిర్యాదులు పెరిగాయి. వాట్సాప్, ఈ–మెయిల్, హ్యాక్​వే, నేరుగా 166 ఫిర్యాదులు రాగా వీటిలో వాట్సాప్ ​ద్వారానే 128 వచ్చాయి. ఇందులో ఫోన్ వేధింపులు 50, బ్లాక్​ మెయిలింగ్ 25, సోషల్​ మీడియా వేధింపులు13 ఉన్నాయి. వీటిల్లో పోలీసులు 7 క్రిమినల్, 27 పిట్టీ కేసులు నమోదు చేశారు. మహిళలు, యువతులను వేధిస్తున్న వారిలో మైనర్లే ఎక్కువగా ఉన్నారు. మే నెలలో మొత్తం 210 మంది వేధింపులకు పాల్పడగా వీరిలో మైనర్లు 38 మంది ఉన్నారు. 

ఫోన్ రిపేరుకు ఇస్తే బ్లాక్​ మెయిల్
జగద్గిరిగుట్టకు చెందిన ఓ మహిళ తన ఫోన్ ను పక్కనే ఉన్న మొబైల్​ షాప్​లో రిపేరుకు ఇచ్చింది. అనంతరం తిరిగి తీసుకుంది. తర్వాతి రోజు నుంచి ఆమెకు డైలీ గుర్తు తెలియని నంబర్ల నుంచి ఓ వ్యక్తి ఫోన్​చేస్తున్నాడు. తన వద్ద మహిళ ఫేస్​తో మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాలని, తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు  షీ టీంకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో వేధిస్తున్నది మొబైల్ షాప్ నిర్వాహకుడు శ్రీకాంత్​అని తేలింది. రిపేర్ టైంలో మహిళ ఫోన్ నుంచి ఫొటోలు, పర్సనల్​వివరాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ప్రేమ పేరుతో ట్రాప్
రాజేంద్రనగర్​లో ఓ జ్యువెల్లరీ షాప్​లో బి.సాగర్ అనే వ్యక్తి అకౌంటెంట్​గా పనిచేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక కుటుంబం రెగ్యులర్​గా ఆ షాప్​కు వస్తుంటుంది. దీంతో సాగర్​బాలికను ట్రాప్​చేశాడు. ఆమె పర్సనల్​ఫొటోలు తీసుకొన్నాడు. అనంతరం తరచూ వీడియో కాల్స్​ మాట్లాడేవాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి సాగర్​ను హెచ్చరించాడు. దీంతో అతడు బ్లాక్​మెయిల్​చేయడం స్టార్ట్​ చేశాడు. తనకు బాలికను ఇచ్చి పెండ్లి చేయాలని లేకుంటే, ఆమె క్యారెక్టర్​ను బ్లేమ్​చేస్తానని సాగర్​బెదిరించాడు. ఆందోళన చెందిన బాలిక తండ్రి షీ టీంను సంప్రదించాడు.