న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో పుట్టిన ‘బిపర్ జాయ్’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ఉదయం ప్రకటించింది. 15వ తేదీ నాటికి గుజరాత్‌లోని కచ్ జిల్లా, పాకిస్థాన్‌లోని కరాచీ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. గుజరాత్ సమీపంలో కేంద్రీకృతమైన బిపర్ జాయ్.. రానున్న 24 గంటల్లో తీవ్రరూపం దాల్చనున్నట్లు తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో సౌరాష్ట్ర – కచ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్‌కు బంగ్లాదేశ్ ‘బిపర్ జాయ్’ అని పేరు పెట్టింది. అల్పపీడనం అంతకంతకు బలపడి బుధవారం నాటికి తీవ్రం అవుతుందని తెలిపారు. గురువారం నాటికి తీవ్రమై భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గుజరాత్ వల్సాద్‌లోని తితాల్ బీచ్‌లో అలలు ఎగిసిపడుతుండటంతో అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జాలరులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ఏరియా ప్రజలు
తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఐఎండీ అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు. కోస్టల్ ఏరియాకు డిజాస్టర్ టీమ్స్‌ను పంపించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది తీర ప్రాంత మత్స్యకారులకు తుఫాన్‌కు సంబంధించిన సమాచారం చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌గా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని
ఐఎండీ అధికారులు సూచించారు.
