ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్

ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్

 

  • తెలంగాణ నుంచి ఇద్దరికి.. ఏపీ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు 
  • మంద కృష్ణకు పద్మశ్రీ, నటుడు బాలకృష్ణ, నటి శోభనకు పద్మభూషణ్
  • ఈ ఏడాది మొత్తం139 అవార్డులు ప్రకటించిన కేంద్రం 
  • 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీల ప్రకటన  

న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు:  76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను  ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరిని, ఏపీ నుంచి ఐదుగురిని పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి వైద్య రంగంలో డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, పబ్లిక్ అఫైర్స్ విభాగంలో మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు దక్కాయి.

నటుడు నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో పద్మ భూషణ్ అవార్డు లభించింది. సాహిత్యం, విద్య విభాగంలో కేఎల్ కృష్ణ, వడిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి, కళా రంగంలో మాడ్గుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు (మరణానంతరం) పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్ లో జరిగే వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. 2025వ ఏడాదికి గాను మొత్తం139 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో ఫారినర్స్/ఎన్ఆర్ఐ/పీఐవో/ఓసీఐ విభాగంలో పది మందికి, మరణానంతరం 13 మందికి అవార్డులు దక్కాయి. ఒక అవార్డును ఇద్దరికి సంయుక్తంగా ప్రకటించారు.   

మూడు పద్మాల తొలి డాక్టర్ 

ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్య రంగంలో విశేష సేవలకు గాను తెలంగాణ నుంచి  దేశంలోనే రెండో (భారతరత్న తర్వాత) అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. కేంద్రం ఆయనను 2002లో పద్మశ్రీ, 2016లో పద్మ భూషణ్ పురస్కారాలతో గౌరవించింది. దీంతో దేశంలో మూడు పద్మ అవార్డులు దక్కించుకున్న తొలి డాక్టర్ గా నాగేశ్వర్ రెడ్డి రికార్డ్  సృష్టించారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌‌‌‌ కర్నూలు సమీపంలోని ఆలూరుకు చెందినవారు.

 హైదరాబాద్‌‌‌‌ సోమాజిగూడలో 1994లో ఆయన స్థాపించిన ఏసియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) దవాఖాన ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్‌‌‌‌ గా గుర్తింపు పొందింది. నాగేశ్వర్ రెడ్డి గ్యాస్ర్టో ఎంట్రాలజీ, పబ్లిక్ హెల్త్ ఫీల్డ్ లో 4 దశాబ్దాల నుంచి కృషి చేస్తున్నారు. అలాగే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పబ్లిక్ అఫైర్స్ విభాగంలో తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.

మెరిసిన తారా ‘పద్మాలు’

ఈ ఏడాది బాలకృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన మరో ఐదుగురికి పద్మ భూషణ్‌‌‌‌ అవార్డు లభించింది. తమిళనాడు నుంచి హీరో అజిత్, నటి శోభన, కర్నాటక నుంచి నటుడు అనంత్ నాగ్, మహారాష్ట్ర నుంచి దర్శకుడు శేఖర్‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌, ప్లే బ్యాక్ సింగర్ పంకజ్ ఉధాస్ (మరణానంతరం)ను పద్మ భూషణ్ వరించింది. పశ్చిమ బెంగాల్ నుంచి మ్యూ జిక్ కంపోజర్ ఆర్జిత్ సింగ్ కు పద్మశ్రీ లభించింది. కోలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న అజిత్ 1993లో ‘అమరావతి’ చిత్రంతో హీరోగా పరిచయమై, ఇప్పటివరకూ అరవైకి పైగా చిత్రాల్లో నటించారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమల్ హాసన్‌‌‌‌, విజయ్ కాంత్ తర్వాత తమిళనాడు నుంచి పద్మ భూషణ్ అందుకున్న ఐదో నటుడిగా నిలిచారు. నటి శోభన స్వస్థలం కేరళ అయినప్పటికీ తమిళనాడు నుంచి అవార్డుకు ఎంపికయ్యారు.  ఆమె1984లో హీరోయిన్‌‌‌‌గా మలయాళంలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. దేశవిదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శలు ఇచ్చారు. అనంత నాగ్ కన్నడతో పాటు తెలుగు, మలయాళ,  మరాఠీ, హిందీ భాషల్లో 270కి పైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ 1983లో కల్ట్ క్లాసిక్ ‘మసూమ్‌‌‌‌’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. పూలన్‌‌‌‌ దేవి జీవితం ఆధారంగా తీసిన ‘బాండిట్ క్వీన్‌‌‌‌ (1994)’తో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆయన తీసిన ‘ఎలిజబెత్‌‌‌‌’ సినిమా 7 విభాగాల్లో ఆస్కార్‌‌‌‌‌‌‌‌కు నామినేట్ అయింది.