కాన్‌బెర్రా: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దాడుల నుంచి గల్ఫ్ దేశాలను రక్షించడానికి క్షిపణులు, నిఘా విమానాన్ని పంపనున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే (ఎయిర్ -టు-ఎయిర్) క్షిపణులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కు పంపనున్నట్టు ఆయన తెలిపారు.
అలాగే, గల్ఫ్ ప్రాంతంలోని గగనతలాన్ని పర్యవేక్షించడానికి రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ7ఏ వెడ్జ్‌టైల్ (వెడ్జ్‌టైల్) నిఘా విమానాన్ని, దాని సిబ్బందిని (సుమారు 85 మంది) పంపనున్నట్టు చెప్పారు. ఇది వచ్చే నాలుగు వారాల పాటు అక్కడ సేవలు అందిస్తుందని తెలిపారు.
ఇరాన్ జరుపుతున్న దాడుల నుంచి ఆ ప్రాంతంలోని దేశాలను కాపాడటం, అక్కడ నివసిస్తున్న 1.15 లక్షల మంది ఆస్ట్రేలియన్ల భద్రతే తమ ప్రధాన ఉద్దేశమని ప్రధాని తెలిపారు. ఇది కేవలం రక్షణ ప్రయోజనాల కోసమేనని, ఇరాన్‌పై దాడులకు కాదని స్పష్టం చేశారు.
