దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ఇండియన్లను ఆదుకోవడానికి అక్కడి భారతీయ వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికీ వసతి, భోజన సౌకర్యాలు కల్పించి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
అల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేశ్ దోషి తన సొంత నివాస భవనంలోని 64 అపార్ట్‌మెంట్‌లను భారతీయుల కోసం అందుబాటులోకి తెచ్చారు. సుమారు 125 మంది భారతీయులకు ఇక్కడ ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆపద సమయంలో తమకు సాయం అందించడంతో యోగేశ్ దోషికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
రోల్స్ రాయిస్ కార్లలో పికప్..
యుద్ధ సమయంలో మరో వ్యాపారవేత్త ధీరజ్ జైన్ కూడా తన ఉదారతను చాటుకున్నారు. తన భారీ ఫామ్‌హౌస్‌ను తాత్కాలిక షెల్టర్‌గా మార్చారు. బాధితులకు ఉచితంగా ఆయన ఆశ్రయం కల్పిస్తున్నారు. వారిని హోటళ్లు, వివిధ ప్రాంతాల నుంచి ఫామ్‌హౌస్‌కు తీసుకురావడానికి ధీరజ్ జైన్ తన వద్ద ఉన్న ఆరు రోల్స్ రాయిస్ కార్లతో సహా మొత్తం 11 విలాసవంతమైన వాహనాలను రంగంలోకి దించారు. బాధితులకు పైసా ఖర్చు లేకుండా బస, రుచికరమైన భోజనం అందిస్తున్నారు.
