ఫోన్ ట్యాపింగ్ కేసులో..ప్రభాకర్ రావుకు బెయిల్..షరతులతో మంజూరు చేసిన సుప్రీం కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో..ప్రభాకర్ రావుకు బెయిల్..షరతులతో మంజూరు చేసిన సుప్రీం కోర్టు
  • దర్యాప్తుకు సహకరించాలి, పాస్​పోర్టు సమర్పించాలి
  • కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని ఉత్తర్వులు

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 గా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం ర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ లో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌‌‌‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసు తెరపైకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు.

అయితే, ముందస్తు బెయిల్ ఇస్తేనే దేశానికి తిరిగి వస్తానని ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ కు నిరాకరించింది. హైకోర్టు తీర్పును గతేడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న.. ‘తొలుత ప్రభకార్ రావును స్వదేశానికి రానివ్వండి’ అని మధ్యంతర రక్షణ కల్పించారు. ఈ రక్షణతో ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం పలుమార్లు దర్యాప్తుకు సహకరించారు.

అయితే.. పోలీస్ శాఖలో సుదీర్ఘంగా పని చేసిన అనుభవం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోని ప్రభాకర్ రావును కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనపై గతేడాది డిసెంబర్ 11న ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అనంతరం మరోవారం పొడగిస్తూ డిసెంబర్ 25న ఆయనను రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ మరోసారి మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్‌‌‌‌ ఆర్‌‌‌‌.మహదేవన్‌‌‌‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

ఇరువాదనలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణకు పూర్తిస్థాయిలో ప్రభాకర్ రావు కట్టుబడి ఉన్న నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించ వద్దని స్పష్టం చేసింది. అలాగే కేసు దర్యాప్తుకు, ట్రయల్ కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం పాస్ పోర్ట్, ట్రావెల్ రికార్డులను ట్రయల్ కోర్టు కు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ తక్షణమే రద్దవుతుందని స్పష్టం చేసింది.