- నషా ముక్త్ భారత్ అభియాన్, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారతపై చర్చ
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దివ్యాంగుల శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజతో కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్సూచించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం, రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు.ఈ నెల 26న జరగనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, యువజన చైతన్య కార్యక్రమాల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను ఆహ్వానించగా, ఈ నెల 26న ముందస్తు కార్యక్రమాల వల్ల వీలు కాదని చెప్పారు. అయితే వచ్చే నెల 2న వరంగల్ జిల్లాలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల సమస్యలు, ‘ప్రణామ్’ డే కేర్ కేంద్రాల సేవలు, వృద్ధుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రి గవర్నర్‌కు వివరించారు. అలాగే దివ్యాంగుల సంక్షేమం, వారి సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల వివరాలపై చర్చించారు.
