ఆన్‌‌‌‌లైన్ ఆటల ఉచ్చులో పిల్లలు..ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి గేమ్స్ వ్యసనంతో యూపీఐ చెల్లింపులు 

ఆన్‌‌‌‌లైన్ ఆటల ఉచ్చులో పిల్లలు..ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి గేమ్స్ వ్యసనంతో యూపీఐ చెల్లింపులు 
  • పేరెంట్స్, గ్రాండ్ ​పేరెంట్స్‌‌‌‌కు తెలియకుండా యాప్‌‌‌‌లో రేర్ ఐటమ్స్, ఎలైట్ పాస్‌‌‌‌ల కొనుగోళ్లు  
  • డబ్బులు కట్ అయ్యాయంటూ సైబర్ పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదులు 
  • పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆన్‌‌‌‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్‌‌‌‌కు చిన్నారులు బానిసలుగా మారుతున్నారు. ఫ్రీ ఫైర్,  ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి ఆన్‌‌‌‌లైన్ గేమ్స్ ద్వారా అపరిచితులతో పరిచయాలు పెంచుకుని ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల కొందరు మైనర్లు ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తులను కలిసేందుకు పక్క రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులకు సకాలంలో అందిన ఫిర్యాదుతో వారిని రక్షించగలిగారు.

అలాగే ఈ మధ్య సైబర్ క్రైమ్ పీస్‌‌‌‌కు కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. వీటిపై పోలీసుల విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలు ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ మాక్స్ ఆటలు ఆడేప్పుడు తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నానమ్మ ఫోన్ల యూపీఐ ఖాతాలను ఉపయోగించి వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొంటున్నట్టు తేలింది. ఈ విషయం తెలియని పెద్దలు తమ డబ్బులు డెబిట్ అయ్యాయంటూ కంప్లయింట్స్​చేస్తున్నారు. విచారణలో పిల్లలు గేమ్స్ ఆడడం వల్లే డబ్బులు కట్ అయిన విషయం తెలిసింది.

దీంతో తల్లిదండ్రులతో పాటు పోలీసులు షాక్ తిన్నారు. డబ్బులు డెబిట్ అయిన టైంలో ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, మోసపూరిత లింకులు రాలేదని తేలింది. పిల్లలే ఫ్రీ ఫైర్,  ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి ఆన్‌‌‌‌లైన్ మల్టీ ప్లేయర్ ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనడానికి ఫోన్‌‌‌‌లో సేవ్ చేసిన కార్డ్స్, యూపీఐ వివరాలను వాడినట్టు తెలిసింది. అయితే ఇది టెక్నికల్‌‌‌‌గా నేరం కాకపోయినా.. ఇండ్లలో పిల్లలపై పర్యవేక్షణ లేకుండా పోయిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది.   

స్టేటస్ కోసం.. దొంగచాటుగా ఖర్చు 

ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే 10 నుంచి 17 ఏండ్లలోపు విద్యార్థులు ప్రస్తుతం క్లాస్‌‌‌‌రూమ్స్​కంటే 'ఫ్రీ ఫైర్, మ్యాక్స్' వంటి గేమ్స్‌‌‌‌లోనే ఎక్కువగా గడుపుతున్నారు. స్నేహితుల మధ్య స్టేటస్ కోసం రేర్ ఐటమ్స్, ఎలైట్ పాస్‌‌‌‌లు కొనుగోలు చేయాలనే ఒత్తిడితో దొంగచాటుగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. స్నేహితుల మధ్య స్టేటస్ కోల్పోకూడదనే తాపత్రయమే ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడడం లేదు. రేర్​ఐటమ్స్​అంటే గేమ్‌‌‌‌లో చాలా అరుదుగా, లిమిటెడ్​టైం మాత్రమే లభించే వస్తువులు.

ఇవి అందరు ఆటగాళ్ల దగ్గర ఉండవు. వీటిని కలిగి ఉండటం గేమ్‌‌‌‌లో ఒక ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తారు. ఈ రేర్ ఐటమ్స్‌‌‌‌ను వాటి బ్యాక్‌‌‌‌గ్రౌండ్ రంగును బట్టి గుర్తిస్తారు. సాధారణంగా పసుపు, బంగారు, ఎరుపులో ఉండే ఐటమ్స్ అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. అలాగే ఎలైట్ పాస్ ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు దొంగచాటుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు.

ఒకప్పుడు ఆన్‌‌‌‌లైన్ క్లాసుల పేరుతో చేతికి వచ్చిన ఫోన్లు, ఇప్పుడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు బిజీగా ఉండడం, టెక్నాలజీపై వారికి అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

గేమింగ్ డిజార్డర్.. 

అతిగా ఆన్‌‌‌‌లైన్ ఆటలు ఆడటం కేవలం అలవాటు మాత్రమే కాదు, ఒక భయంకరమైన మానసిక రుగ్మత అని డబ్ల్యూహెచ్‌‌‌‌వో 2019లోనే గుర్తించి దీనికి 'గేమింగ్ డిజార్డర్' అని పేరు పెట్టింది. ఆటలపై నియంత్రణ కోల్పోవడం, చదువు, నిద్ర, కుటుంబ సభ్యుల కంటే ఆటలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, నష్టాలు జరుగుతున్నా ఆట మానలేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. దీనివల్ల పిల్లల్లో తీవ్ర కోపం, దూకుడు ప్రవర్తన, చదువులో వెనుకబాటుతనం, నిద్రలేమి, కంటి సమస్యలు, సామాజిక దూరం పెరుగుతున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే, ఆటలను కఠినంగా నిషేధించడం దీనికి సరైన పరిష్కారం కాకపోవచ్చంటున్నారు. అది వారిలో మరింత ఉత్సుకతను పెంచి దొంగచాటుగా ఆడేందుకు దారి తీస్తుందంటున్నారు. 

ఆప్యాయంగా మాట్లాడడమే పరిష్కారం  

పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం, ఆటల సమయాన్ని క్రమబద్ధీకరించడమే దీనికి అసలైన పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. దేశ భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం అసలైన 'ఫ్రీ ఫైర్' గేమ్‌‌‌‌ను దేశంలో నిషేధించింది. అయినప్పటికీ, సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు చిన్నారులు వీపీఎన్‌‌‌‌ల ద్వారా దొంగచాటుగా ఈ గేమ్‌‌‌‌ను ఇంకా ఆడుతూనే ఉన్నారు.

మరోవైపు, ఈ గేమ్‌‌‌‌కు అప్‌‌‌‌గ్రేడెడ్ వెర్షన్‌‌‌‌గా వచ్చిన 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌‌‌‌లలో అందుబాటులో ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత గేమ్‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా మారిన ఈ వెర్షన్‌‌‌‌కు చిన్నారులు అత్యంత వేగంగా ఆకర్షితులవుతూ, తీవ్ర వ్యసనానికి లోనవుతున్నారు.  

చిన్నారుల ఆన్​లైన్ అలవాట్లు తెలుసుకోవాలి

ఆన్‌‌‌‌లైన్ ఆటల ముప్పు నుంచి చిన్నారులను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు కొన్ని కీలక చర్యలు చేపట్టాలి. మొదటగా, పిల్లలు వాడే ఫోన్ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో 'పేరంటల్ కంట్రోల్స్', 'పర్చేజ్ అప్రూవల్స్' ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌‌‌‌లను నిరంతరం గమనిస్తూ, వాటి ప్రాముఖ్యతను ఇంట్లోని వృద్ధులు, పెద్దవారికి కూడా వివరించాలి.

అవసరమైతే పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులు మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో ఎవరి మొబైల్ వాడినా సరే, రోజువారీ ఫోన్ వాడకంపై కచ్చితమైన సమయ పరిమితి విధించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు ఆడే ఆటల గురించి అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ వారిలో తీవ్ర కోపం, నిద్రలేమి, మార్కులు తగ్గడం, ఫోన్‌‌‌‌ను దొంగచాటుగా దాచడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చైల్డ్ సైకాలజిస్ట్‌‌‌‌ లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి. ‘మానిటర్– మెంటార్– మోటివేట్’ అనే త్రిసూత్రాన్ని తల్లిదండ్రులు పాటించాలి. ‘క్లిక్ చేసే ముందు ఆలోచించండి’ అనే సందేశాన్ని ప్రతి చిన్నారి గుర్తుంచుకోవాలి.  
- సీపీ సజ్జనార్