ఇంజినీరింగ్లో 1.14 లక్షల సీట్లు.. కన్వీనర్ కోటా కింద అందుబాటులో 81,620 సీట్లు

ఇంజినీరింగ్లో 1.14 లక్షల సీట్లు.. కన్వీనర్ కోటా కింద అందుబాటులో 81,620 సీట్లు
  • కంప్యూటర్ సైన్స్ గ్రూపుల్లోనే 58 వేల సీట్లు 
  • నేటి నుంచే ఎప్​సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 
  • జులై 1 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. టీజీఎప్ సెట్ అడ్మిషన్ల ప్రక్రియలో అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,14,007 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

దీనిలో కన్వీనర్ కోటా కింద 81,620 సీట్లను భర్తీ చేయనున్నారు. విద్యార్థులు జూన్ 25 నుంచి జూలై 1 వరకు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీ, సర్కారు కాలేజీలు 22,  ప్రైవేట్ యూనివర్సిటీలు రెండు,  ప్రైవేట్ కాలేజీలు151 ఉన్నాయి. సర్కారు, యూనివర్సిటీ కాలేజీల్లో 6,046 సీట్లు ఉన్నాయి. 

వీటన్నింటినీ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయనున్నారు. 151 ప్రైవేట్ కాలేజీల్లో 1,06,701  సీట్లు, రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,800 సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 74,314, ప్రైవేటు వర్సిటీల్లో 1,260 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. కాగా, జేఎన్టీయూహెచ్ పరిధిలోని 133 ప్రైవేటు కాలేజీల్లో 65 వేలకు పైగా కన్వీనర్ సీట్లు ఉన్నాయి. ఓయూ పరిధిలో 14 కాలేజీలు ఉండగా, 7,833 సీట్లు, కేయూ పరిధిలో నాలుగు ప్రైవేటు కాలేజీలు ఉండగా 1,103 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. కాగా, గతేడాది మొత్తం కన్వీనర్ కోటాలో 91,640 సీట్లుండగా, గతంతో పోలిస్తే పది వేల వరకు తగ్గాయి. అయితే, ఇంకా కొన్ని కోర్సుల్లో సీట్లతో పాటు కొత్త కోర్సుల సీట్లు యాడ్ కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. 

కంప్యూటర్ సైన్స్ సీట్లే 81వేలు.. 

ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు మెజార్టీ సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ బ్రాంచ్‌‌‌‌ల్లోనే ఉన్నాయి. ఆయా కోర్సుల్లో మొత్తం 81,768 సీట్లు ఉండగా, దానిలో 58,038 సీట్లు కన్వీనర్ కోటాలోనే ఉన్నాయి. దీంట్లో సీఎస్​ఈ బ్రాంచ్​లోనే కన్వీనర్ కోటాలో ఏకంగా 27,431 సీట్లు ఉండడం గమనార్హం. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో కన్వీనర్ కోటాలో 15,795 సీట్లు, సివిల్, మెకానికల్ వంటి కోర్ గ్రూపుల్లో కేవలం 6,871 సీట్లు, ఇతర గ్రూపుల్లో మరో 916 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలి  


మెరుగైన కాలేజీలో సీటు సాధించాలంటే అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని అడ్మిషన్ల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. కాలేజీ కోడ్, బ్రాంచ్ కోడ్‌‌‌‌లను క్షుణ్ణంగా పరిశీలించి మాన్యువల్ ఆప్షన్ ఫామ్‌‌‌‌ను నింపుకున్నాకే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయాలని కోరారు. లాగిన్ ఐడీ, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లను ఎవరికీ ఇవ్వొద్దని, సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిన్ని వివరాలకు https://tgeapcet.nic.in వెబ్ సైట్ చూడాలని కోరారు. 

84 వేల మంది అభ్యర్థులు

కౌన్సెలింగ్ కోసం ఇప్పటివరకు 84,002 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో 36,393 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌ను పూర్తి చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌కు జూన్ 29 వరకు గడువు ఉంది. ర్యాంకుల వారీగా చూస్తే.. 10 వేల లోపు ర్యాంకు సాధించిన వారిలో దాదాపు 6,700 మంది ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నారు. వందలోపు ఐదుగురు, ఐదు వందల లోపు ర్యాంకులున్న వారు 47 మంది, వెయ్యిలోపు 182 మంది మాత్రమే స్లాట్ బుక్ చేసుకున్నారు.