- నెల రోజుల్లోనే రెండుసార్లు పెరిగిన పాల సేకరణ ధర
- బోనస్‌తో ప్రోత్సాహం.. సబ్సిడీపై దాణాకు సన్నాహాలు
- 12 వేల లీటర్ల నుంచి 17,500 లీటర్లకు చేరిన సేకరణ
- అప్పుల నుంచి బయటపడి గాడిలో పడుతున్న డెయిరీ
అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతపడే దశకు చేరిన మదర్ డెయిరీ కొత్త ఊపిరి పోసుకుంటోంది. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ) టేకోవర్ చేసిన నెలరోజుల్లోనే పాల ధరలను రెండుసార్లు పెంచి పాడి రైతులకు పెద్ద ఊరట కల్పించింది.
రెగ్యులర్‌గా బిల్లులు చెల్లించడం, బోనస్ ప్రకటించడం, సబ్సిడీపై దాణా అందించేందుకు చర్యలు చేపట్టడంతో రైతులు మళ్లీ మదర్ డెయిరీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాల సేకరణ గణనీయంగా పెరిగి, నష్టాల్లో ఉన్న డెయిరీ తిరిగి గాడిలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
యాదాద్రి, వెలుగు: మదర్ డెయిరీ(నార్మాక్స్)ను పటిష్టం చేసేందుకు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ) చర్యలు చేపట్టింది. పాడి రైతుల నుంచి సేకరించిన పాలకు రెగ్యులర్‌గా బిల్లులు చెల్లిస్తోంది. డెయిరీని టేకోవర్ చేసిన నెల రోజుల్లోనే ప్రైవేట్ డెయిరీల స్థాయిలో పాల ధరలను పెంచింది. త్వరలో సబ్సిడీపై దాణా అందించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది.
గత పాలక వర్గాల కారణంగా ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నార్మాక్స్(మదర్ డెయిరీ) తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి, పాల బిల్లులు చెల్లించలేని పరిస్థితికి చేరింది. రూ.70 కోట్ల అప్పుల్లో ఉన్న డెయిరీని గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి పరిస్థితి వివరించారు.
దీంతో ఎన్‌వోసీకి అంగీకారం లభించింది. అనంతరం ఎన్‌డీడీబీ డెయిరీని టేకోవర్ చేసింది. బ్యాంకుల్లో ఉన్న రూ.27 కోట్ల అప్పు చెల్లించడంతో పాటు మరో రూ. 13 కోట్లు డెయిరీకి అందించి మే 23 నుంచి బాధ్యతలు చేపట్టింది.
రెండుసార్లు పాల ధర పెంపు..
ఎన్‌డీడీబీ టేకోవర్ చేసే నాటికి 5 శాతం ఫ్యాట్ ఉన్న బర్రె పాలకు లీటర్‌కు రూ.40, 3 నుంచి 4.5 శాతం ఫ్యాట్ ఉన్న ఆవు పాలకు రూ.34.50 చెల్లించేవారు. పాల సేకరణ పెంచేందుకు స్టీరింగ్ కమిటీ ధర పెంపుపై నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి బర్రె పాలకు లీటర్‌కు రూ.41.50, ఆవు పాలకు రూ.35.65 చెల్లిస్తోంది.
మరోసారి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు జూన్ 24 నుంచి బర్రె పాలకు రూ.1, ఆవు పాలకు రూ.0.81 పెంచారు. దీంతో బర్రె పాల ధర లీటర్‌కు రూ.42.50, ఆవు పాల ధర రూ.36.46కు చేరింది. ఆవు పాల ధర ప్రైవేట్ డెయిరీల స్థాయికి చేరగా, బర్రె పాల ధర మాత్రం ఇంకా లీటర్‌కు రూ.5 తక్కువగా ఉంది.
పాడి రైతులకు బోనస్...
ధర పెంపుతో పాటు ఎక్కువ పాలు పోసే రైతులకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. రోజుకు 100 లీటర్లు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.1 బోనస్ ఇస్తామని తెలిపారు. అలాగే రోజుకు వెయ్యి లీటర్లు సేకరించే సెంటర్‌కు లీటర్‌కు రూ.1 చొప్పున రోజుకు రూ.వెయ్యి అదనంగా బోనస్ చెల్లించనున్నారు.
పెరిగిన పాల సేకరణ..
ఎన్‌డీడీబీ టేకోవర్ తర్వాత రైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నారు. ధర పెరగడంతో రైతులు మళ్లీ మదర్ డెయిరీకి పాలు పోయడం ప్రారంభించారు. టేకోవర్‌కు ముందు రోజుకు 12 వేల లీటర్లే సేకరించగా, ప్రస్తుతం రోజుకు 17,500 లీటర్లు సేకరిస్తున్నారు. ఈ ఏడాదిలో రోజుకు లక్ష లీటర్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు.
సబ్సిడీపై దాణా..
పాల ధర పెంపుతో పాటు రైతులకు సబ్సిడీపై దాణా అందించాలని ఎన్‌డీడీబీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం భువనగిరిలో మూతపడిన ఫీడ్ మిక్సింగ్ పాయింట్‌ను పునరుద్ధరించే పనులు ప్రారంభించింది. దీనికి సుమారు రూ. 40 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.
