హైదరాబాద్‌‌లో బీఎల్‌‌ఏలు తక్కువే..జిల్లాలో 47 లక్షల ఓటర్లు, 4,062 బూత్‌‌లు  

హైదరాబాద్‌‌లో బీఎల్‌‌ఏలు తక్కువే..జిల్లాలో 47 లక్షల ఓటర్లు, 4,062 బూత్‌‌లు  
  • కాంగ్రెస్ పార్టీ నుంచి 3,601 బీఎల్ఏలు 
  • బీజేపీ నుంచి 2,941, ఎంఐఎం నుంచి 2,371 మంది 
  • 1,988 మందిని మాత్రమే నియమించిన బీఆర్‌‌‌‌ఎస్ 
  • 10 పార్టీల నుంచి కేవలం 10,901 మంది నియామకం
  • ఒక్కరినీ పెట్టని పార్టీలు ఆరు

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్పెషల్ ​ఇంటెన్సివ్​ రివిజన్(సర్)​ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌‌ఏలు) నియామకాన్ని రాజకీయ పార్టీలు అంతగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు, 4,062 పోలింగ్ బూత్‌‌లు ఉండగా, ప్రతి రాజకీయ పార్టీ ఒక్కో బూత్‌‌కు ఒక్కో బీఎల్‌‌ఏను నియమించాల్సి ఉంది. అయితే జిల్లాలో గుర్తింపు పొందిన పది రాజకీయ పార్టీల నుంచి కేవలం 10,901 మంది మాత్రమే బీఎల్‌‌ఏలుగా నమోదయ్యారు.

అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 3,601 మంది బీఎల్‌‌ఏలను నియమించింది. బీజేపీ 2,941 మందిని, ఎంఐఎం 2,371 మందిని, బీఆర్‌‌ఎస్ 1,988 మందిని నియమించాయి. బీఎస్పీ, సీపీఎం, టీడీపీ, ఆప్, వైఎస్సార్‌‌సీపీ, ఎన్సీపీ పార్టీలు ఒక్క బీఎల్‌‌ఏను కూడా నియమించలేదు.  రాష్ట్రంలో గురువారం నుంచి సర్  ప్రక్రియ ప్రారంభమవుతున్నది.

ఈ నేపథ్యంలో ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాల్లో బీఎల్‌‌ఏల పాత్ర చాలా కీలకమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. స్థానిక పరిస్థితులపై వారికే ఎక్కువ అవగాహన ఉంటుందని చెప్తున్నారు.

బీఎల్ఏలకే ఎక్కువ గుర్తింపు

సర్ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యం త కీలకమని జిల్లా ఎన్నికల అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాల్లో వీరు ఎన్నికల అధికారులకు సహకరిస్తారంటున్నారు. బీఎల్‌‌వోల కంటే బీఎల్‌‌ఏలకు స్థానికంగా గుర్తింపు ఉంటుంది. ఒక్కో బీఎల్‌‌ఏ రోజుకు 50 మంది ఫామ్‌‌లు బీఎల్‌‌వోకు సమర్పించే చాన్స్ ఉంది. ప్రస్తుతం నియమించిన బీఎల్‌‌వోలలో తక్కువ అనుభవం ఉన్న వారు15 శాతం వరకు ఉన్నారు. ఇలాంటి చోట బీఎల్ఏ మద్దతు చాలా అవసరం.

ఉన్నతాధికారుల దిశానిర్దేశం

బూత్ లెవల్ అధికారులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ‘సర్’​ను పారదర్శకంగా నిర్వహిస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. బీఎల్‌‌వోలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు 408 మంది బీఎల్‌‌వో సూపర్ వైజర్లు, వీరిపై 15 మంది ఎలెక్షన్స్ డీటీలు. వీరిపై 93 ఏఈఆర్‌‌‌‌వోలు, వీరిపై 15మంది ఈఆర్‌‌‌‌వోలు మానిటరింగ్ చేస్తారని చెబుతున్నారు. ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే గుర్తించి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెబుతున్నారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఉన్నతాధికారులతో సమావేశమై ‘సర్’ ప్రక్రియలో చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.  

18 రకాల వస్తువులతో కిట్లు 

‘సర్’ నిర్వహణ కోసం బీఎల్‌‌వోలకు అందజేసిన ప్రత్యేక కిట్‌‌లో జూట్ బ్యాగ్, వాటర్ బాటిల్, గొడుగు, క్యాప్, ప్యాడ్, రిజిస్టర్, ఫామ్–-6, డిక్లరేషన్ ఫామ్‌‌లు, ట్రైనింగ్‌‌బుక్స్, ఎన్యూమరేషన్ ఫామ్‌‌లు, సర్వే పూర్తయినట్లు అతికించే స్టిక్కర్లు, నాలుగు భాషల్లో ప్రచార కరపత్రాలు, ప్రత్యేక టీ-షర్ట్, పవర్ బ్యాంక్, స్టేషనరీ కిట్‌‌ కలిపి మొత్తం 18 రకాల వస్తువులు ఉన్నాయి.

కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

18 ఏండ్లు పూర్తిచేసుకున్న కొత్త ఓటర్లు ఫామ్-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏండ్లు పూర్తిచేసుకునే యువత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా బీఎల్‌‌వోలను సంప్రదించవచ్చని, అవసరమైతే టోల్ ఫ్రీ ఓటర్ హెల్ప్‌‌లైన్ 1950 ద్వారా కూడా సహాయం పొందవచ్చని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణతో ‘సర్’ ముగియనుంది. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్‌‌లను బీఎల్‌‌వోల ద్వారా లేదా ఎన్నికల సంఘం ఆన్‌‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు.