హైదరాబాద్, వెలుగు: రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చేందుకు ఇరువైపులా ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. బుధవారం సెక్రటేరియెట్‌లో అధికారులతో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. లీడ్ బ్యాంక్ హోదాతో పాటు వందల కోట్ల ప్రభుత్వ డిపాజిట్లను ఎస్బీఐ నుం చి ఉపసంహరించుకునే యోచనలో ప్రభుత్వం వెల్లడించడం, ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వబోమనే సంకేతాల నేపథ్యంలో భేటీ ప్రాధన్యతను సంతరించుకున్నది.
తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం ఉంటే ఇరువైపులా భారీ నష్టాలు ఉంటాయని, ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్ర ప్రభా వం పడుతుందని ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ లావాదేవీ లు నిలిచిపోతే బ్యాంకుకు వ్యాపారపరంగా పెద్ద దెబ్బ తగలడంతో పాటు, ప్రభుత్వ శాఖల పరిధిలోని సాధారణ జీతాల ఖాతాదారులు, సామా న్య బ్యాంకు ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలూ పట్టువిడుపులకు సిద్ధంగా ఉన్నందున రెండు రోజుల్లో వివాదం పూర్తిగా కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
