ఫాక్స్‌బరో: వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు పసికూన ఘనా గట్టి షాక్ ఇచ్చింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గ్రూప్–ఎల్ మ్యాచ్ 0–0తో డ్రా అయ్యింది. మ్యాచ్ అంతటా బంతి ఎక్కువ సమయం ఇంగ్లండ్ ఆటగాళ్ల అధీనంలోనే ఉన్నప్పటికీ, ఘనా పటిష్టమైన డిఫెన్స్‌ను వారు ఛేదించలేకపోయారు.
చివరి నిమిషాల్లో ఇంగ్లండ్ వరుసగా గోల్స్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ డ్రాతో రెండు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్ 86వ నిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు నికో ఓరైల్లీ కొట్టిన హెడర్ గోల్‌పోస్ట్ పైభాగానికి (క్రాస్‌బార్) తగిలి వెనక్కి వచ్చింది.
అక్కడే సిద్ధంగా ఉన్న స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ ఆ బంతిని గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. అంతకుముందు 78వ నిమిషంలో ఘనాకు గోల్ చేసే సువర్ణావకాశం వచ్చింది. ఫార్వర్డ్ ప్రిన్స్ గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్తుండగా, ఇంగ్లండ్ డిఫెండర్ ఎజ్రి కొన్సా అతడిని వెనక నుంచి అడ్డుకున్నాడు.
ఆ సమయంలో రెఫరీ పెనాల్టీ ఇవ్వకపోవడంపై ఘనా కోచ్ కార్లోస్ క్విరోజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్.. ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌పై 19 సార్లు దాడులు చేయగా, ఘనా ఒకే ఒక్క ప్రయత్నం చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో ఆఫ్రికా దేశాల చేతిలో ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడకపోవడం విశేషం.
