- జులై 26 నుంచి ఎంఫార్మసీ కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. పీజీఈసెట్-అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. కోర్సుల వారీగా కౌన్సెలింగ్ తేదీలను వేర్వేరుగా ప్రకటించారు.
ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ అభ్యర్థులకు జులై 2 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల అప్‌లోడ్ ప్రక్రియ కొనసాగనుంది. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఓయూలో జులై 8,9 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జులై 13 నుంచి 15 వరకూ కొనసాగనుండగా, జులై 19న సీట్లను అలాట్‌మెంట్ చేయనున్నారు.
మరోపక్క, ఎంఫార్మసీ, ఫార్మాడీ అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ జులై 26 నుంచి 31 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 4 నుంచి 6 వరకు కొనసాగనుండగా, ఆగస్టు 10న సీట్లు అలాట్‌మెంట్ చేయనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకుhttps://pgecetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని కన్వీనర్ సూచించారు.
