ఇసుక బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమాలకు తావులేదు..ఆన్లైన్ బుకింగ్‌‌‌‌‌‌‌‌లో పారదర్శకత పెంచేందుకు చర్యలు : టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి

ఇసుక బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమాలకు తావులేదు..ఆన్లైన్ బుకింగ్‌‌‌‌‌‌‌‌లో పారదర్శకత పెంచేందుకు చర్యలు : టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి
  • త్వరలో సాయంత్రం 5 గంటలకూ రాండమైజేషన్ బుకింగ్స్​
  • టీజీఎండీసీ వద్ద కోటి టన్నులకుపైగా ఇసుక నిల్వలు
  • శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట పరిధిలో మరొక సాండ్​ బజార్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి
  • టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక కొరత లేదని, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వద్ద ప్రస్తుతం కోటి మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇసుక నిల్వలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టీజీఎండీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఇసుక బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి అక్రమాలకు తావులేదని, రోజుకు సగటున 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి విడుదల చేస్తుండగా, అందులో 63 వేల మెట్రిక్ టన్నులు బుక్ అవుతోందని వివరించారు.

మిగిలిన 46 వేల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రతిరోజూ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మిగిలిపోతోందని, అందువల్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. ఉదయం 9 గంటలకే కాకుండా, పారదర్శకత పెంచేందుకు త్వరలోనే సాయంత్రం 5 గంటలకు కూడా రాండమైజేషన్ బుకింగ్స్ విధానాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు.  జూన్ 1 నుంచి 23 వరకు మొత్తం 25.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయగా, అందులో 14.63 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక బుక్ అయిందని, మిగిలిన 10.73 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు యార్డుల్లోనే అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. వినియోగదారుల కోసం శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట పరిధిలో మరొక సాండ్​ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 200 సెకన్ల టైమర్​..  

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఇసుక బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దళారులు ఐటీ స్క్రిప్టులు, బాట్లను ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకున్నామని ఎండీ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం లాగిన్, ఓటీపీ, స్టాక్ యార్డ్ ఎంపిక వంటి వివిధ దశల్లో మొత్తం 200 సెకన్ల విధిగా ఉండే 'ఫోర్సుడ్​ టైమర్' విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. సైబర్ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సర్వర్ పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు బాట్ ఐపీలను సిస్టమ్ ద్వారా బ్లాక్ చేశామన్నారు.

వినియోగదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు అమలు చేసిన రాండమైజేషన్ బుకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మొత్తం 28,332 మంది వినియోగదారులకు ఇసుక కేటాయింపులు జరిగాయని వివరించారు. టాప్ 20 స్టాక్ యార్డుల్లో రాండమైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 10 వేల వాహనాలు లబ్ధి పొందాయన్నారు. ఇందులో అత్యధికంగా 5 కంటే తక్కువ ట్రిప్పులు పొందిన సాధారణ వినియోగదారులే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు బల్క్ బుకింగ్ ప్రక్రియను మరింత సరళీకృతం చేసి, నిబంధనలను తగ్గించామని వెల్లడించారు.

ఈ విభాగంలో వచ్చిన మొత్తం బల్క్ అప్లికేషన్లలో 97 శాతం దరఖాస్తులను ఆమోదించామన్నారు. ఇందులో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి 13,843 దరఖాస్తులకు గాను 13,616 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని స్పష్టం చేశారు. ఇసుక రవాణా, పంపిణీలో నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎండీ హెచ్చరించారు. ఒక రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుక్ చేసిన ఆర్డర్లను అనుమతి లేకుండా మరొక రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేసే అక్రమ పద్ధతులను అరికట్టేందుకు జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు అక్రమ బదిలీలకు పాల్పడిన 83 ఆర్డర్లపై చర్యలు తీసుకుని, రూ. 2.83 లక్షల పెనాల్టీలను వసూలు చేశామని చెప్పారు.