- 20 కిలోమీటర్లు దాటితే స్పెషల్ ప్లాన్
- ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు, సౌకర్యాలపై మంత్రి దామోదర సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజన, ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకులాలను సమీపంలోని ఆస్పత్రులతో ట్యాగింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు అత్యవసర సమయాల్లో వేగంగా చికిత్స అందుతుందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఆస్పత్రులకు 20 కిలోమీటర్ల కంటే దూరంగా ఉన్న విద్యాసంస్థల కోసం ప్రత్యేక రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
వర్షాకాలం దృష్ట్యా మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి ఆస్పత్రిలో మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. 108, 102 అంబులెన్స్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండకూడదని ఆదేశించారు. మాతా శిశు సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇటీవల గుండాల పీహెచ్‌సీలో జరిగిన మాతృ మరణం వంటి ఘటనల నుంచి అధికారులు పాఠాలు నేర్చుకోవాలని హెచ్చరించారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి డెలివరీకి ముందే బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు..
రాష్ట్రంలోని అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అడవులు, కొండలు అడ్డంకి కాకుండా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 34 డయాలసిస్ సెంటర్లను, మరో 37 అదనపు మెషీన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సికిల్ సెల్, రక్తహీనత, క్షయ వ్యాధుల నియంత్రణతో పాటు మొబైల్ యూనిట్ల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను విస్తరించాలని ఆదేశించారు.
కేవలం ఆఫీసుల్లో కూర్చుని రిపోర్టులు ఇవ్వడం కాకుండా, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆశ్రమ పాఠశాలలు, పీహెచ్‌సీలను నిరంతరం తనిఖీ చేయాలని మంత్రి సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
