మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలు చేస్తరు..రాజకీయాల్లోనూ మహిళలు రాణించాలి:

మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలు చేస్తరు..రాజకీయాల్లోనూ మహిళలు రాణించాలి:
  •  స్త్రీల ఆశయాలకు కుటుంబాలు అండగా నిలవాలి
  • మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయినప్పుడే అభివృద్ధి సాధ్యమని వెల్లడి
  • ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉంది: కవిత 
  •  కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: మంత్రి పొన్నం
  • జూబ్లీహిల్స్‌‌‌‌లో వెటా ఇండియా చాప్టర్ లాంచ్‌‌‌‌ కార్యక్రమం 

హైదరాబాద్, వెలుగు: మహిళలకు తగిన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో నిర్వహించిన ‘విమెన్ ఎంపవర్‌‌‌‌మెంట్ తెలుగు అసోసియేషన్’(వెటా) ఇండియా చాప్టర్ లాంచ్, మహిళా సాధికారత సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యక్షురాలు కవిత, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. వెటా వ్యవస్థాపకురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సాధారణ గృహిణిగా ప్రయాణం మొదలుపెట్టి.. అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదగడమే కాకుండా, వెటా వంటి సంస్థను స్థాపించి వేలాది మందికి అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. 

ఇప్పుడు ఆ సంస్థను ఇండియాకు విస్తరించడం ఆమె దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. యశస్విని రెడ్డి వంటి వారు కూడా సాధారణ గృహిణుల స్థాయి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి నాయకులుగా ఎదగడం మహిళల సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. మహిళల విజయాల వెనుక కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పురుషుల ప్రోత్సాహం ఎంతో అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. తన కుటుంబంలోని మహిళలు కూడా విద్య, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారని, మహిళల శ్రమను గౌరవిస్తూ, వారి ఆశయాలకు కుటుంబాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. నిర్ణయాత్మక స్థానాల్లో, రాజకీయాల్లో మహిళలు మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. సంస్థ ఇండియా చాప్టర్ ద్వారా చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

మహిళలే ఇంటి యజమానులు: పొన్నం ప్రభాకర్​

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహిళలు కేవలం బస్సులో ప్రయాణించడమే కాదు.. వారినే బస్సు యజమానులను చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇంటి యజమాని అయిన మహిళ పేరు మీదే ఇస్తున్నామని వెల్లడించారు. 

స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లతో మహిళలు రాజకీయంగా ఎదుగుతున్నారని, గృహిణి సమర్థురాలైతే ఆ ఇల్లు, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళా సాధికారత కోసం ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలోని ‘వెటా’చేస్తున్న కృషి అభినందనీయమని, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మహిళలకు ఇలాంటి వేదికలు అవసరమని పేర్కొన్నారు.

ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉంది: కవిత

ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. మహిళలకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి సపోర్ట్ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎంత ప్రతిభ చూపినా, ఎంత కష్టపడినా ఈ సమాజంలో ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట పడుతూనే ఉందన్నారు. మహిళలు మంచి ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ పొందే సమయంలో పెళ్లిళ్లు అవుతున్నాయని, పెళ్లి, పిల్లల వల్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో గ్యాప్ వస్తే.. తిరిగి జాయిన్ అయ్యేటప్పుడు జూనియర్లుగా పని చేయాల్సి వస్తోందని, ఇది చాలా అన్యాయమన్నారు. 

జ్యుడీషియరీలోనూ మహిళా జడ్జిల సంఖ్య పైస్థాయికి వెళ్లేసరికి తగ్గిపోతోందని, ట్యాలెంట్ ఉన్నా అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా మహిళా నాయకులను టార్గెట్ చేసి జెండర్ బేస్డ్ ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పటికి కూడా రాష్ట్రంలో 15–-19 ఏండ్ల లోపు అమ్మాయిలు తల్లులవుతున్న సంఖ్య 7.2 శాతం ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. యువత లైక్స్, ఫాలోవర్స్ కోసం కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌‌‌‌తో ఉండాలని, ఒకసారి లక్ష్యం వైపు నిర్ణయం తీసుకుంటే మళ్లీ వెనక్కి చూడొద్దని సూచించారు. 

మహిళా సాధికారత జరగాలంటే ప్రభుత్వం, ఫ్యామిలీ, సోసైటీ అందరూ హెల్ప్ చేయాలన్నారు. అన్ని రంగాల్లో 50 శాతం మహిళా ఉద్యోగులు ఉండాలని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినా సరే ఫ్యామిలీ నుంచి సహకారం ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు సాధించుకున్నామని, కానీ ఆ 33 శాతం కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మహిళలకు ఇంట్లో, సోసైటీ నుంచి సపోర్ట్ ఉండటం లేదని, ఇప్పటికీ కూడా కొంచెం భిన్నంగా ఉంటే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రపంచమే మహిళలకు బయాస్డ్‌‌‌‌గా ఉందని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు కోసం అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వెటా వ్యవస్థాపకులు, చైర్ పర్సన్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆధునిక ప్రపంచంలోనూ మహిళలను చులకనగా చూసే పరిస్థితులు ఉండడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.