పాత టైర్లతో అద్భుతాలు.. మామూలు టాలెంట్ కాదు..

పాత టైర్లతో అద్భుతాలు.. మామూలు టాలెంట్ కాదు..

ఆ వీధిలో వెళ్తుంటే రోడ్డుకు ఇరువైపులా డైనోసర్లు, డ్రాగన్లు, తాబేళ్లు, బైక్​లు వంటి కళాకృతులు కనిపిస్తుంటాయి. అటు వైపు వెళ్లే వారు ఆగి మరి వాటితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని వర్ధాలో ఓ పంక్చర్​​ షాపు యజమాని పాత టైర్లతో వివిధ కళాకృతులను చేసి ఔరా అనిపిస్తున్నాడు. 

పాడైపోయిన పాత టైర్లతో వివిధ కళాకృతులను తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు వర్ధాకు చెందిన దాబిర్ షేక్. టైర్లకు ​పంక్చర్లు వేస్తూనే తనలోని కళతో స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. వర్ధాలో దాబిర్​ షేక్​ అనే వక్తి పంక్చర్​​ షాపు నడుపుతున్నారు. దుకాణంలో చాలా టైర్లు పేరుకుపోయాయి. చాలా మంది ఇలా పోగైన టైర్లను చెత్త కుప్పలో లేదంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వాటిలో వర్షం నీరు చేరి దోమలకు ఆవాసంగా మారతాయి. కాల్చితే కాలుష్యానికి కారణమవుతాయి. ఈ సమస్యను అర్థం చేసుకున్న దాబిర్​ షేక్​​​.. వాటితో ఏదైనా కొత్తగా చేసి ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలనుకున్నారు. 

పాత టైర్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతులను సృష్టించి ప్రదర్శించాలనుకున్నారు. పాడైపోయిన పాత టైర్లతో ఖాళీ సమయాల్లో వివిధ కళాకృతులను తయారు చేస్తున్నారు. టైర్లకు ​పంక్చర్లు వేస్తూనే తనలోని కళతో పరిశుభ్రత, స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నారు. పలు కళాఖండాలకు రూపం ఇచ్చి తన దుకాణం ముందు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఆ వైపునకు వెళ్లేవారు వాటిని చూసి తమ సెల్ ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. దాబిర్​ షేక్​​పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

టైర్లను బయట పారేయటం ద్వారా అందులో నీరు నిలిచి అపరిశుభ్రతకు కారణమవుతుందని తెలిసిన ప్రజలు తమ ఇళ్లల్లో ఉన్న పాత టైర్లను తన వద్దకు తీసుకువచ్చి, వివిధ కళాకృతులను తయారు చేయించుకుని ఇంట్లో వాడుకునేందుకు తీసుకెళ్తున్నారని దాబిర్​ షేక్​ చెబుతున్నారు.