- ఫ్రాన్స్‌తో అతిపెద్ద ఢిఫెన్స్ డీల్‌కు డీఏసీ గ్రీన్ సిగ్నల్
- వెల్లడించిన రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: రాఫెల్యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇచ్చింది. 114 రాఫెల్ జెట్లతో పాటు ఇతర సైనిక పరికరాల కొనుగోలుకు రూ.3.60 లక్షల కోట్లు వెచ్చించేందుకు ఓకే చెప్పింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌తో అతిపెద్ద ఢిఫెన్స్ డీల్‌కు ఢిఫెన్స్అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు 13 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు గురువారం ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ కింద.. 18 విమానాలను రాఫెల్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ ‘ఫ్లై అవే’ స్థితిలో సరఫరా చేస్తుంది. మిగిలినవి భారతదేశంలో 50 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతాయి. వీటిని దశలవారీగా తయారు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ 114 రాఫెల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీటర్, 26 ట్విన్ సీటర్ వేరియంట్‌లు ఉన్నాయి.
ఈ కొనుగోలు ఖర్చును రక్షణ మంత్రిత్వ శాఖ అందించనప్పటికీ ఇది రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.3.15 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం లభించడం గమనార్హం. అయితే, ఈ ఏడాది చివరిలోపు అధికారికంగా ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇంకా రక్షణ మంత్రిత్వ శాఖ, డస్సాల్ట్ ఏవియేషన్‌తో ఆయుధాల ప్యాకేజీ ఖర్చు, సూక్ష్మ వివరాలను ఖరారు చేయడానికి చర్చలు జరపాల్సి ఉంటుంది. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) కూడా ఈ కొనుగోలు కార్యక్రమానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 36 రాఫెల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తున్నది. అందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలు విషయమై రక్షణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పింది.
