కార్ల డిజైనింగ్ తయారీపై పారిశ్రామిక వేత్తలు దృష్టి సారించాలి : మంత్రి కేటీఆర్

కార్ల డిజైనింగ్ తయారీపై పారిశ్రామిక వేత్తలు దృష్టి సారించాలి : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు కార్ల డిజైనింగ్, తయారీపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తెలంగాణ ఉత్పత్తులను అందించాలని కోరారు. జపాన్ కు చెందిన ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సొల్యూషన్ డైఫుకు సంస్థ తెలంగాణలో అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర  ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. 

 ఉపాధి అవకాశాలు..

తెలంగాణలో డైఫుకు సంస్థ రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో యువతకు 800కుపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. హైదరాబాద్​ లో మరో 8 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని చెప్పారు. అత్యాధునిక ఫ్యాక్టరీ ద్వారా ఆటోమేటెడ్ స్టోరేజ్, రిట్రీవర్ సిస్టమ్స్, సార్టింగ్ ట్రాన్స్ఫర్, వెహికిల్స్ కన్వేయర్ల వంటి వరల్డ్ క్లాస్ పరికరాలు తయారవుతాయని తెలిపారు. 

కార్ల తయారీ చూసి ఆశ్చర్యపోయా..

జపాన్ లో సుజుకీ తయారీ మ్యూజియాన్ని సందర్శించానని..అక్కడ విద్యార్థుల కార్ల తయారీకి మంత్రముగ్ధుడిని అయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. జపాన్ తయారీ రంగంలో ప్రపంచానికే ఆదర్శమని, అందుకే జపాన్ వస్తువులను దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తయారీ రంగంలో గ్లోబల్ ప్లేయర్స్ ను పెంచాలని సూచించారు.