- డెవలప్మెంట్ కు రెండేండ్ల కిందటే 158.5 కోట్లు శాంక్షన్ చేసిన ప్రభుత్వం
- డిజైన్లు ఫైనల్ కాక మొదలుకాని పనులు
- ఏటా వర్షాకాలంలో మునుగుతున్న కాలనీలు
- ఇండ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాల బాట పడుతున్న ప్రజలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ లో ముంపు సమస్యకు కారణమవుతున్న బొందివాగు నాలా పనులకు మోక్షం కలగడం లేదు. ఏటా ఈ నాలా వల్ల దాదాపు 30 కాలనీల వరకు నీట మునిగి, జనాలు పునరావాస కేంద్రాల బాట పడుతుండగా, ప్రభుత్వం దీని డెవలప్మెంట్ కు గతంలోనే నిధులు శాంక్షన్ చేసింది.
కానీ నాలా డిజైనింగ్ పనులు పూర్తి కాక బొందివాగు డెవలప్మెంట్ కు అడుగులు పడటం లేదు. ఇదిలాఉంటే వేసవిలోనే పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో ముంపు ముప్పు తప్పే అవకాశం ఉంది. ఆఫీసర్లు, లీడర్లు చొరవ చూపి బొందివాగు డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.158.5 కోట్లతో డెవలప్మెంట్ కు ప్లాన్
వరంగల్ ట్రై సిటీలో నయీంనగర్, భద్రకాళి, బొందివాగు నాలాలు ప్రధానమైనవి. ఇందులో హనమకొండ వైపు నయీంనగర్ నాలా, వరంగల్ వైపు బొందివాగు నాలాలు ఆక్రమణలతో కుచించుకుపోయి ఏటా ముంపునకు కారణమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముంపు సమస్యను పట్టించుకోకపోవడంతో వర్షాలు పడిన ప్రతిసారి ఇండ్లలోకి నీళ్లు చేరి, జనాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హనుమకొండలో ఉన్న నయీంనగర్ నాలాపై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి సుమారు రూ.వంద కోట్లతో డెవలప్ చేశారు.
నయీంనగర్ నాలాపై బ్రిడ్జి నిర్మించడంతో పాటు వరద నీళ్ల కాలనీల్లోకి వెళ్లకుండా రిటైనింగ్ వాల్స్ కట్టించారు. దీంతో నయీంనగర్ నాలా సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. ఆ తరువాత వరంగల్ లో ముంపునకు కారణమవుతున్న బొందివాగు నాలా అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఆఫీసర్లు రూ.158.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. దీంతో రెండేండ్ల కిందటే ప్రభుత్వం బొందివాగు నాలా డెవలప్ మెంట్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తరువాత రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులు రెండేండ్ల కిందట బొందివాగు అభివృద్ధి పనులకు శిలాఫలకం కూడా వేశారు.
పూర్తికాని డిజైనింగ్ పనులు
ఏటా వర్షాకాలంలో వరంగల్ శివారు ప్రాంతంలో ఉన్న కొండపర్తి, భట్టుపల్లి, అమ్మవారిపేట, ఉర్సు రంగసముద్రం తదితర చెరువుల నుంచి వచ్చే వరద నీళ్లన్నీ బొందివాగు నాలా, భద్రకాళీ నాలా గుండా నాగారం చెరువు వైపు వెళ్తుంటాయి. ఉర్సు రంగ సముద్రం నుంచి భద్రకాళి వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు ఉండే ఈ నాలా చుట్టూ ఆక్రమణలతో కుచించుకుపోయింది. దీంతో 2023 వర్షాకాలంలో వచ్చిన వరదలకు ఆ చుట్టుపక్కల 50 కాలనీల వరకు నీట మునిగాయి.
బొందివాగు నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఆఫీసర్లు డిజైనింగ్ లో మార్పులు చేపట్టారు. నాలాను 20 మీటర్ల మేర విస్తరించడంతో పాటు రిటైనింగ్ వాల్స్, హంటర్ రోడ్డు, పద్మాక్షివైపు రెండు దిక్కులా ఇన్ ఫ్లో రెగ్యులేటర్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు.
నాలా చుట్టూ నేల స్వభావం సరిగా లేకపోవడంతో భవిష్యత్తులో వచ్చే వరదలను తట్టుకునేలా వరంగల్ నిట్ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో డిజైనింగ్ లో మార్పులు చేస్తున్నారు. కానీ నెలలు గడుస్తున్నా బొందివాగు డిజైనింగ్ మార్పుల పనులు మాత్రం కంప్లీట్ కావడం లేదు. ఫలితంగా నిధులున్నా బొందివాగు అభివృద్ధి పనులకు ముహూర్తం కుదరడం లేదు.
వేసవిలో పూర్తి చేస్తేనే గండం గడిచేది!
వర్షాకాలం మొదలైతే బొందివాగు చుట్టూ ఉన్న సంతోషీమాతా కాలనీ, ఎన్టీఆర్ నగర్, సాయినగర్ కాలనీ, బృందావన కాలనీ, బీఆర్ నగర్ తదితర ప్రాంతాలన్నీ నీటమునగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కాలనీలన్నీ నీట మునిగి జనాలంతా ఇండ్లను విడిచి జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల బాట పట్టాల్సి వస్తోంది.
ఇదిలాఉంటే బొందివాగు నాలా అభివృద్ధికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. క్షేత్రస్థాయిలో అధికారులు నెలలు గడుస్తున్నా డిజైనింగ్ పూర్తి చేయకపోవడం వల్లనే పనులు మొదలవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే వేసవి స్టార్ట్ కాగా.. వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తేనే బొందివాగు గండం నుంచి బయటపడే అవకాశం ఉంది. దీంతో ఇకనైనా నాలా అభివృద్ధి పనులు చేపట్టి, ముంపు సమస్య నుంచి తమను గట్టెక్కించాలని వరంగల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు. అధికారులు చొరవ చూపి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఇదే విషయమై డీఈఈ మధుసూదన్ రెడ్డిని వివరణ కోరగా.. గతంలో కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని బొందివాగు నాలా డిజైనింగ్ లో మార్పులు చేస్తున్నామన్నారు. అవి పూర్తికాగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు సాధ్యమైనంత తొందర్లో పనులు చేపడతామని సమాధానం ఇచ్చారు.
