దళితబంధులో అక్రమాలు.. తెలంగాణలో రోడ్డెక్కిన దళితులు

దళితబంధులో అక్రమాలు.. తెలంగాణలో  రోడ్డెక్కిన దళితులు

తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అక్రమాలపై దళితులు ఆందోళనకు దిగారు. అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని  అనర్హులకు ఇచ్చిన దళితబంధును రద్దు చేయాలంటూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. 

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు దళితులు. దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. నిరసనలో వైరా మున్సిపాలిటీలోని 1, 2, 20వ వార్డులకు చెందిన దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

రఘునాధ పాలెం మండలం కేంద్రంలో గృహలక్ష్మి , దళిత బంధులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.  బిఆర్ఎస్ , మంత్రి పువ్వాడకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. 

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో దళితులు ఆందోళన చేస్తున్నారు. దళితబంధు పథకాన్ని బీఆర్ఎస్ కు చెందిన వారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య మహాలక్ష్మి చిన్ననాగారంలో పర్యటిస్తుండడంతో ఆందోళన చేస్తున్నారు దళితులు.  గ్రామంలో ముళ్ల కంచె వేసి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు దళితులను అడ్డుకోవడంతో చిన్ననాగారంలో ఉద్రిక్తత ఏర్పడింది. 

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు హుజూర్నగర్ నియోజకవర్గం,గరిడేపల్లి మండలం, పొనుగోడు గ్రామస్తుల ఆందోళనకు దిగారు. అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.  అనర్హులకు ఇచ్చిన దళిత బందు రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు.