అయోధ్య గుడి ప్రారంభోత్సవానికి ఒక్క దళితుడినైనా పిలిచిండా?: రాహుల్ గాంధీ

అయోధ్య గుడి ప్రారంభోత్సవానికి ఒక్క దళితుడినైనా పిలిచిండా?:  రాహుల్ గాంధీ

ప్రతాప్‌‌గఢ్: కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి దళితులు, వెనుకబడినవారు, రాష్ట్రపతిని ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, అమితాబ్ బచ్చన్‌‌ ను ఆహ్వానించడం ద్వారా దేశంలోని 73 శాతం మంది ప్రజలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని మోదీ సందేశం ఇచ్చారని విమర్శించారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర సోమవారం యూపీలోని రాంపూర్ ఖాస్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లాల్‌‌గంజ్​కు చేరుకుంది. అక్కడి ఇందిరా చౌక్‌‌లో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన. ‘‘మోదీ.. రైతుల జేబులకు కోత పెట్టి.. ధనవంతుల జేబులు నింపుతున్నారు. మతం పేరుతో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే పని జరుగుతోంది. దేశంలో యువతకు ఉపాధి, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. మోదీకి చెందిన ఈడీ, సీబీఐ వంటి సంస్థలు కీలుబొమ్మలుగా మారాయి. ప్రతిపక్షాలను బెదిరించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు” అని రాహుల్​మండిపడ్డారు. అంతకుముందు ఇందిరాచౌక్‌‌కు చేరుకున్న రాహుల్ గాంధీకి అక్కడి కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.