V6 News

Johnny Master : డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత.. భార్య గెలుపుపై జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.!

 Johnny Master : డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత.. భార్య గెలుపుపై జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.!

తెలుగు సినిమా డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA) ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. ఊహించని విధంగా  ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సుమలత, ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్‌పై 29 ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాలు సినీ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి.

గ్రూప్ సపోర్ట్‌ను ఎదురించి గెలుపు..

ఈ ఎన్నికల్లో సుమలత ఒంటరిగా, ఎలాంటి బలమైన గ్రూప్ సపోర్ట్ లేకుండా బరిలోకి దిగారు. మరోవైపు, ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్‌కు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్ వంటి సీనియర్, అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లందరూ బహిరంగంగా మద్దతు పలికారు. అంతేకాకుండా, గతంలో జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన డ్యాన్సర్ శ్రష్ఠి వర్మ సైతం .. పోలింగ్ కేంద్రంలో ఉండి జోసెఫ్ ప్రకాష్‌కు మద్దతుగా ప్రచారం చేసింది.. సుమలతను ఓడించాలనే లక్ష్యంతో జరిగిన ఈ క్యాంప్ పాలిటిక్స్‌ను సైతం లెక్కచేయకుండా, సుమలత 228 ఓట్లు సాధించి ఘన విజయం సాధించింది. జోసెఫ్‌కు 199 ఓట్లు వచ్చాయి.  ఈ ఎన్నికల ఫలితాలు సినీ కార్మిక వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. వ్యవస్థాగత మద్దతు కంటే, గ్రౌండ్ లెవల్‌లోని సభ్యుల నమ్మకమే ముఖ్యమని ఆమె నిరూపించారు.

జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.

ఇటీవలే 'పెద్ది' లిరికల్ సాంగ్‌తో జానీ మాస్టర్ తన కంపోజింగ్‌కు విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఆయన భార్య ఈ ప్రతిష్ఠాత్మక ఎన్నికల్లో 'రెబల్'గా గెలుపొందడం వారి క్రేజ్‌ను, డ్యాన్సర్లలో వారికి ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు సినీ వర్గాలు. తన భార్య విజయంపై జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. "నా ప్రేమ, మాస్టర్ సుమలతకు తెలుగు సినిమా, టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు..

ALSO READ : మోగ్లీ వాయిదా.. నేనే దురదృష్ట వంతుడిని.. వెండి తెరకు నేనంటే ఎందుకింత ద్వేషం: డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

 మా యూనియన్ వ్యవస్థాపకులైన ముక్కు రాజు మాస్టర్‌కు ఈ కుటుంబంలో మమ్మల్ని భాగం చేసినందుకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులం అని జానీ పోస్ట్ చేశారు. మా ప్యానెల్‌కు,  యూనియన్‌లోని ప్రతి ఒక్క సభ్యునికి మీ మద్దతు, నమ్మకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అంచనాలకు అనుగుణంగా జీవించడానికి, మీకు ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవ అందించడానికి మేము కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నాము. కలిసి, మన పరిశ్రమకు మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకువద్దాం అని ఆయన పోస్ట్ చేశారు. సుమలత నేతృత్వంలో TFTDDA యూనియన్ సభ్యులకు ఎలాంటి ప్రయోజనాలు, సంక్షేమ కార్యక్రమాలు అందుతాయోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.