అల్లాడిపోతున్నారమ్మా మందు ప్రియులు : దసరా డ్రై డే కావటంతో చుక్క కోసం బారులు

అల్లాడిపోతున్నారమ్మా మందు ప్రియులు : దసరా డ్రై డే కావటంతో చుక్క కోసం బారులు

దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా అని పాడుకుంటాం.. దసరా రోజు ముక్కలు, బొక్కలు లేకుండా నడిచిద్దా చెప్పండీ.. అలాంటి దసరా ఈసారి డ్రై డే రోజు వచ్చింది.. అలాంటి ఇలాంటి డ్రై డే కాదు.. గాంధీ జయంతి అక్టోబర్ 2న వచ్చింది. మామూలుగానే గాంధీ జయంతికి డ్రై డే కామన్. ఈసారి అక్టోబర్ 2న దసరా రావటంతో చికెన్, మటన్, మందు ప్రియులు అల్లాడిపోతున్నారు. దసరా రోజు ఇవేమీ లేకపోతే ఇక పండగ ఏంటీ అంటూ.. ముందు రోజునే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు.. దీంతో అక్టోబర్ 1వ తేదీన మందు షాపుల దగ్గర బారులు కనిపించాయి. మందు ప్రియులు ముందుగానే కావాల్సిన లిక్కర్ కొనుగోలు చేస్తూ.. రేపటి పార్టీకి రెడీ అవుతున్నారు.

దసరా ముందు రోజే చికెన్, మటన్, వైన్ షాపులకు పరుగులు తీయటంతో హైదరాబాద్ సిటీ జనం అల్లాడిపోతున్నారు. పండగ రోజు ఎంచక్కా నాలుగు పెగ్గులు.. నాలుగు ముక్కలతో ఎంజాయ్ చేద్దాం అంటే కనీసం బార్లు కూడా లేకపోవటంతో.. అక్కడా ఇక్కడా సిట్టింగ్ వేయాల్సిన పరిస్థితి. దసరా రోజు పూర్తిగా డ్రై డే కావటం.. అందులోనూ చికెన్, మటన్ షాపులు కూడా బంద్ కావటంతో.. ముందు రోజే అంటే.. మహర్నవమి రోజునే ఇంట్లోకి ముక్క, చుక్క తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ సిటీలో చికెన్ షాపులు, వైన్ షాపుల దగ్గర రద్దీ బాగా ఉంది. రాత్రి 10 గంటల వైన్ షాపులు బంద్ అవుతుండటంతో.. మధ్యాహ్నం నుంచి రేపటి  కోసం మందు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు హైదరాబాదీలు
 

దసరా పండుగ అయినప్పటికీ అక్టోబర్ 2న మద్యం మాంసం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ జారీ చేశారు పోలీసులు. దీంతో ముందురోజే సరుకు కొనడానికి వైన్ షాపుల దగ్గర బారులు తీరారు మందుబాబులు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఏ వైన్ షాప్ చూసినా మందుబాబులు బారులు తీరు కనిపిస్తున్నారు. రేపటి మందు పార్టీ కోసం సరుకు రెడీ చేసుకునేందుకు పనులన్నీ మానుకొని వైన్ షాపుల ముందు క్యూ కట్టారు మందుబాబులు.

దసరా మద్యం సేల్:

  • సెప్టెంబర్ నెలలో 3 వేల కోట్ల మద్యం అమ్మకాలు.
  • నిన్న ఒక్క రోజే 333కోట్ల మద్యం సేల్.
  • 30 వ తేదీన  3 లక్షల 21 వేల లిక్కర్ కేసులు అమ్మకం
  • 3 లక్షల 24 వేల కేసులు బీర్ సేల్ జరిగింది.
  • ఈ రోజు కూడా 400 కోట్ల వరకు మద్యం సేల్ జరుగుతుందని అంచనా
  • సెప్టెంబర్ నెలలో రూ. 3 వేల 48 కోట్ల 51 లక్షల మద్యం సేల్ 
  • సెప్టెంబర్ నెలలో  రూ.29 లక్షల 92 వేల కేసులు లిక్కర్ అమ్మకం
  • 36 లక్షల 48 వేల కేసుల బీర్ సేల్ 
  • గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 210 కోట్ల కు పెరిగిన మద్యం సేల్...
  • లిక్కర్ స్టాక్ పెట్టుకుంటున్న వైన్స్ లు బార్ అండ్ రెస్టారెంట్స్.

ఇక మాంసం ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాములుగా హాలిడే వస్తేనే మాంసం దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. అలాంటిది దసరా లాంటి పండగల సమయాల్లో డిమాండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఈసారి దసరా గాంధీజయంతి రోజున రావడంతో మాంసం ప్రియులు పండగ ముక్క దొరకదేమోనని అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ముందు రోజే మటన్, చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు మాంసం ప్రియులు. డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యాపారులు ఇవాళ అర్థరాత్రి వరకు అమ్మకాలు జరపాలని డిసైడ్ అయ్యారు.

ఆ రకంగా... డ్రై డే రోజే దసరా పండగ రావడంతో హైదరాబాద్ లో ఒకరోజు ముందే మందుబాబుల హడావిడి మొదలైంది. ఇంతకీ మీరు సరుకు తెచ్చిపెట్టుకున్నారా లేదా... ఇప్పుడే వెళ్లి కావాల్సిన బ్రాండ్ తెచ్చుకోండి.. లేకపోతే, మీ ఫేవరేట్ బ్రాండ్ స్టాక్ అయిపోవచ్చు. మళ్ళీ రేపు బ్లాక్ లో కొనడం కోసం తిప్పలు పడాలి.. ముందే జాగ్రత్త పదండి.. హ్యాపీ దసరా.. !