వినయ్, నాయిని మధ్య కబ్జా రగడ

వినయ్, నాయిని మధ్య కబ్జా రగడ

వరంగల్‍, వెలుగు : బీఆర్‍ఎస్‍ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‍భాస్కర్‍, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి నడుమ భూకబ్జాల లొల్లి మొదలైంది. పోస్టర్లతో షురూ అయిన గొడవ దూషించుకునే స్థాయికి వెళ్లింది. గత ఎన్నికల్లో ఇరువురు పోటీ పడగా.. ఈసారి ఎన్నికలకు ముందే వేడి రాజుకుంది. ఇన్నాళ్లు పెండింగ్‍ పనులు, అభివృద్ధిపై డిస్కషన్‍ జరగగా.. ఇప్పుడది భూకబ్జాలు, సెటిల్‍మెంట్ల వైపు మళ్లింది. 

నాయినిపై.. తెల్లవారుజామున పోస్టర్లు

కాంగ్రెస్‍ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍ రెడ్డికి వ్యతిరేకంగా శుక్రవారం తెల్లవారుజాముల 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. ‘పేదవారి 500 ఇందిరమ్మ ఇండ్లు కాజేసింది ఎవరు రాజేంద్రా.? కాంగ్రెస్‍ ప్రభుత్వ హయంలో 500 ఇందిరమ్మ ఇండ్ల పేరుమీద పేదవారి డబ్బులు తీసుకున్నది మీరు కాదా? కాకతీయ యూనివర్సిటీలో మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి అమ్ముకున్నదెవరు? ఎమ్మెల్యే కాకముందే ఇన్ని అక్రమాలు చేసిన మీరు ఒకవేళ వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి మీరు బీఆర్‍ఎస్‍ ప్రభుత్వాన్ని, లోకల్‍ ఎమ్మెల్యేను విమర్శించే నైతిక హక్కు లేదు’ అంటూ నియోజకవర్గ పరిధిలోని అన్నీ డివిజన్లలో పోస్టర్లు వేశారు. కాంగ్రెస్‍ డివిజన్‍ లీడర్లు ఉదయం 7 గంటలకు వాటిని తొలగించారు. 
 

భూకబ్జాల ఎమ్మెల్యే.. అంటూ నాయిని ఫైర్‍

ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన అనుచరుడైన రంజిత్‍రెడ్డి సాయంతోనే తనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయించాడని నాయిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాలకు, సెటిల్‍మెంట్లకు వినయ్‍ భాస్కరే కేరాఫ్ అని విరుచుకుపడ్డాడు. వినయ్ భాస్కర్ భూకబ్జాలకు తాళలేక సీఎం కేసీఆర్ సైతం మందలించాడని ఆరోపించారు. కేయూ భూకబ్జాల్లో తాను ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.

డబుల్‍ బెడ్‍రూం ఇండ్ల ఇష్యూతో..

ఈ నెల 19న కాంగ్రెస్‍ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో నాయిని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డబుల్‍ బెడ్‍రూం ఇండ్ల అంశం తెరపైకి వచ్చింది. నగరంలోని ఏషియాన్‍ మాల్‍ వెనకాల 500 డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు నిర్మించిన ఎమ్మెల్యే ఏ ఒక్కరికైనా వాటిని ఇచ్చారా? అంటూ నాయిని ప్రశ్నించారు. డబుల్‍ ఇండ్ల పేరుతో డబ్బులు వసూలు చేశారని.. ఇప్పుడు వాటిని ఇస్తే మరో 1000 మంది అసలు బాధితులు నిరసనలకు దిగుతారని, అందుకే ఇండ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు నాయినికి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. కాగా, నాయిని ఫిర్యాదుపై ఇంతవరకు పోలీసులు సరిగా స్పందించలేదు. నాయిని పేర్లతో సహా ఇచ్చి, సీసీ కెమెరాల ద్వారా పరిశీలించాలని కోరారు. అయినా పోలీసులకు ఎటూ తేల్చలేదు.

'భూకబ్జాలు చేసే అవసరం నాకు లేదు'

హనుమకొండ, వెలుగు : అధికారంలో ఉన్న నాయకులను అభివృద్ధి, సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తామని, దానికి జవాబు చెప్పాల్సింది పోయి వినయ్​ భాస్కర్ స్థాయి గురించి మాట్లాడారని నాయిని రాజేందర్​ రెడ్డి ఫైర్​అయ్యారు. హనుమకొండలోని డీసీసీ భవన్​ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కబ్జాలు చేసినోళ్లకు ఉండే స్థాయి తనకు లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ కబ్జాలు చేశాడని, ఎదురు తిరిగితే కేసులు పెట్టాడని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీలో ల్యాండ్స్​ కబ్జా చేశానని ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంపై అదే వర్సిటీలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ పాల్గొన్నారు.

చేతులెత్తేసిన కేంద్రం.. మభ్యపెడుతున్న రాష్ట్రం

కోచ్​ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని, రాష్ట్రంలో ఉన్న బీ ఆర్​ఎస్​ ప్రభుత్వం మాటలతో మభ్య పెడుతోంద ని నాయిని విమర్శించారు. ఇక్కడి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అసమర్థత వల్లే కాజీపేట రైల్వే కోచ్​ ఫ్యాక్టరీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే కాలం వెళ్లదీస్తున్నాయన్నారు. కోచ్​ ఫ్యాక్టరీ విష యంలో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. బీఆర్​ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లవుతున్నా కోచ్​ ఫ్యాక్టరీ తేలేకపోయిందన్నారు.