దత్తన్నఆశలు తీరేనా?

దత్తన్నఆశలు తీరేనా?

హైదరాబాద్, వెలుగుగవర్నర్​ పదవులపై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర బీజేపీ సీనియర్​ నేతలకు నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సీనియర్లు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డిలకు గవర్నర్​ పదవులు దక్కుతాయన్న ప్రచారం జరిగింది. రాజకీయ అనుభవానికి, పార్టీ పట్ల వారు చూపిన సిన్సియారిటీకి తగిన ఫలితం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఇటీవలే మోడీ సర్కారు కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కూడా నియమించింది. కానీ రాష్ట్ర నేతలెవరికీ చాన్స్​ రాలేదు. దీనిపై కొందరు నేతలు ఢిల్లీలో ఆరా తీశారని.. హైకమాండ్ పెట్టుకున్న వయసు నిబంధనతోనే వీరికి గవర్నర్ గిరీ దూరమైందని సమాచారం.

75 ఏళ్లు దాటితేనే..!

75 ఏళ్లలోపు వయసున్న సీనియర్​ నేతలు యాక్టివ్​ రాజకీయాల్లో ఉండాల్సిందేనని బీజేపీ హైకమాండ్​ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 75 ఏండ్లు దాటిన సీనియర్లనే గవర్నర్ పదవులకు పరిశీలిస్తామని స్పష్టం చేసినట్టు వెల్లడిస్తున్నారు. దత్తన్న, ఇంద్రసేనారెడ్డిల వయస్సు 75 ఏళ్ల లోపే కావడంతో వాళ్లు ప్రస్తుతానికి గవర్నర్ పదవిపై ఆశలను వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రసేనారెడ్డి పార్టీ వ్యవహారాల్లో మునిగిపోయారని తెలిపారు. అయితే దత్తాత్రేయ పరిస్థితి వేరని, గతంలో కేంద్ర మంత్రి పదవి నుంచి అర్ధంతరంగా తప్పించడం ఆయనకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. గత టెర్మ్​లో రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎంపీ దత్తన్నే. ఇటీవలి ఎలక్షన్లలో ఆయన ఎంపీ సీటును కిషన్​రెడ్డికి ఇచ్చారు. అయితే దత్తన్న పార్టీలో సీనియర్, బీసీ వర్గానికి చెందినవారు కూడా కావడంతో.. తిరిగి ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇస్తారని, ఢిల్లీ పెద్దలు హామీ కూడా ఇచ్చారని పార్టీలో ప్రచారం సాగింది. కానీ మోడీ సర్కారు రెండోసారి ఏర్పాటై, మూడు దఫాలుగా గవర్నర్ల నియామకం జరిగినా.. దత్తన్న పేరు రాలేదు. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయోనని, దత్తన్నకు గవర్నర్​ గిరీ వస్తుందో, లేదోనని పార్టీ నేతలు కొందరు కామెంట్​ చేస్తున్నారు.