
పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఆరుగురు
ఆలయ భూముల గొడవే కారణం
నిందితుల్లో ఇద్దరి అరెస్టు
జైపూర్: రాజస్థాన్‌లో కరౌలి జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో ఆలయ పూజారి పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో గాయాలపాలై ఆయన చనిపోయారు. జైపూర్‌కు 177 కిలోమీటర్ల దూరంలో బుధవారం జరిగిందీ ఘటన.
ఇదేంటని అడిగినందుకు..
రాజస్థాన్ గ్రామాల్లోని ఆలయ భూములకు పూజారు లే సంరక్షకులుగా ఉంటారు. వాటి ఆదాయంతో గుడు ల్లో పూజలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారి జీవనాధారం కూడా ఈ భూములే. కరౌలి జిల్లాలోని బుక్నా గ్రామంలో రాధాకృష్ణ టెంపుల్ ట్రస్ట్ కు చెందిన 5.2 ఎకరాల భూమి పూజారి బాబూ లాల్ వైష్ణవ్ అధీనంలో ఉంది. ఈ భూమికి దగ్గరగా ఉన్న స్థలంలో తన కోసం ఒక ఇల్లు కట్టుకోవాలని పూజారి అనుకున్నారు. భూమి చదును చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడ డామినేషన్ ఎక్కువుండే మీనా కమ్యూనిటీ వాళ్లు అడ్డుకున్నరు.
ఆ భూమి తమదని వాదించారు. దీంతో గొడవ గ్రామ పంచాయతీకి చేరింది. పెద్దలు పూజారికి అనుకూలంగా తీర్పు చెప్పారు. ఈ నేపథ్యంలో భూమి తనదని చెప్పేందుకు సంకేతంగా తాను కొత్తగా పండించిన కొన్ని జొన్న బేళ్లను పూజారి అక్కడ ఉంచారు. కానీ పూజారి చదును చేయించిన భూమిలో నిందితులు తమ గుడిసెను నిర్మించడం ప్రారంభించారు. దీంతో ఇది గొడవకు దారితీసింది. ‘‘నేను చదును చేసిన భూమిలో పెట్టిన జొన్న బేళ్లను అరుగురు వ్యక్తులు బుధవారం పెట్రోల్ పోసి అంటించారు. ఇదేంటని ప్రశ్నించినందుకు వాళ్లు నా మీద కూడా పెట్రోల్ పోసి, నిప్పు పెట్టారు” అని పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో పూజారి వైష్ణవ్ చెప్పారు.
ఇద్దరి అరెస్టు
గాయపడ్డ పూజారి వైష్ణవ్.. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురు వారం రాత్రి చనిపోయారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాష్ మీనాతోపాటు మరొకరిని అరెస్టు చేశారు.