- ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిక
- యాంటీబయాటిక్స్ వాడకంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
హైదరాబాద్, వెలుగు: అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు కొరడా ఝలిపించారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) కంట్రోల్ పేరుతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూల్స్ కు విరుద్ధంగా యాంటీబయాటిక్స్ మందులు అమ్ముతున్న 190 మెడికల్ షాపులను గుర్తించారు.
ఈ దాడుల్లో క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ లేకుండానే షెడ్యూల్ -హెచ్, హెచ్1 మందులు అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. మందులు అమ్ముతున్నా బిల్లులు ఇవ్వకుండా, చాలా షాపుల్లో రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ లేకుండానే అమ్మకాలు సాగిస్తున్నట్లు డీసీఏ దాడుల్లో బయటపడింది.
ఎంతమందికి యాంటీబయాటిక్స్ అమ్మారో రాసే రిజిస్టర్లు మెయింటైన్ చేయడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కరోజే190 మెడికల్ షాపుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 కింద క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల.. శరీరంలోని బ్యాక్టీరియా ముదిరిపోయి, మందులకు లొంగని సూపర్ బగ్స్ గా తయారవుతున్నాయని డీసీఏ డీజీ, ఐపీఎస్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
దీనివల్ల భవిష్యత్తులో చిన్న జబ్బు వచ్చినా మందులు పనిచేయవని, ఇది గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్-10 ప్రమాదాల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. కోళ్ల ఫారాలు, చేపల చెరువుల్లో కూడా యాంటీబయాటిక్స్ వాడకం వల్ల.. మనం తినే ఆహారం ద్వారా కూడా ఈ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి.. వంటి చిన్న సమస్యలకు యాంటీబయాటిక్స్ అస్సలు పనిచేయవని, ఇలాంటి చిన్న సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని హెచ్చరించారు. డాక్టర్ మందులు రాసిస్తే.. జ్వరం తగ్గగానే ఆపేయకూడదని, కోర్సు మొత్తం పూర్తి చేయాలని, లేదంటే రోగం మళ్లీ తిరగబెడుతుందన్నారు. సొంత వైద్యం పనికి రాదని, పాత ప్రిస్క్రిప్షన్లతో కూడా మందులు కొనుగోలు చేయకూడదని సూచించారు.
