తమిళనాడులో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. కల్తీ మద్యానికి ఏకంగా 29 మంది బలయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మరో వంద మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని అంటున్నారు అధికారులు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు హాస్పిటళ్ల దగ్గర కన్నీరుమున్నీరవుతున్నారు.
తమిళనాడులోని కల్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీ మద్యం తాగడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా సేలం, పుదుచ్చేరి, విల్లుపురంలోని హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ పొందుతున్న వారిని పరామర్శించారు జిల్లా కొత్త కలెక్టర్ ప్రశాంత్
కల్తీ మద్యం ఘటనపై సీరియస్ గా స్పందించింది స్టాలిన్ సర్కార్. ఇంతమంది చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశామని ట్వీట్ చేశారు. ఘటనపై CB CID విచారణకు ఆదేశించామన్నారు. ఇవాళ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు సీఎం స్టాలిన్. కల్లకురిచి కలెక్టర్ ను బదిలీ చేయడంతో పాటు SP ని సస్పెండ్ చేసింది సర్కార్.. మరోవైపు కల్తీ మద్యం తాగి హాస్పిటల్ చికిత్స పొందుతున్న వారు వేగంగా కోలుకోవాలన్నారు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
