మంచిర్యాలలో మోసం..కోట్లలో అప్పులు చేశారు..మొబైల్వ్యాపారులు పరారయ్యారు..

మంచిర్యాలలో మోసం..కోట్లలో అప్పులు చేశారు..మొబైల్వ్యాపారులు పరారయ్యారు..

మంచిర్యాల, వెలుగు: ​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గణేశ్​ మొబైల్స్​ వ్యాపారులు కోట్లలో అప్పులు చేసి పరారయ్యారు. అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి తోటి వ్యాపారులు, పలువురి వద్ద కోట్ల రూపాయలు అప్పులు చేసిన అన్నదమ్ములు రెండు నెలలుగా మొబైల్  షాపు మూసి వేసి కనిపించకుండా పోయారు.​ ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై వారం రోజుల కింద కోర్టు నుంచి పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. 

సదరు వ్యాపారులకు అప్పులు ఇచ్చిన వారు, బాధితులు ఎవరైనా ఉంటే తమ లావాదేవీల ఆధారాలను, పత్రాలను వెంటనే నమోదు చేయాలని ఆ నోటీసుల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయో? రావో? అని లబోదిబోమంటున్నారు. ఎన్ని కోట్ల రూపాయలకు ఐపీ పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారం మంచిర్యాలలో తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.