
- ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంల నుంచి మనీ ట్రాన్స్ఫర్
హైదరాబాద్, వెలుగు: చనిపోయిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సిమ్ కార్డుతో అతని స్నేహితుడు రూ.20లక్షలు కొట్టేశాడు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం నుంచి మనీ ట్రాన్స్ఫర్చేసుకున్నాడు. ఈ కేసులో కీలక నిందితుడు మహ్మద్ ఆసిఫ్ పాషాను కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు ఈ నెల 23న అరెస్టు చేయగా, టీజీ సైబర్‌సెక్యురిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఇరిగేషన్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి 2013లో రిటైర్ అయిన ఎండీ సమీఉద్దీన్ 2022లో చనిపోయారు. అతనికి ఎస్బీఐ, కెనరా బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి.
వాటితోపాటు అతని సోదరి సబిహా సుల్తానా ఎస్బీఐ బ్యాంకు అకౌంట్కూడా సమీఉద్దీన్ ఫోన్ నంబర్‌కు లింక్ అయ్యి ఉంది. ఇరిగేషన్ విభాగంలో పనిచేసే టైంలో సమీఉద్దీన్ కు తోటి ఉద్యోగి జహంగీర్ పరిచయం ఉంది. ఆ టైంలో జహంగీర్సమీఉద్దీన్ తో స్నేహంగా ఉండి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. సమీఉద్దీన్ చనిపోయిన తర్వాత కుట్రకు తెరలేపాడు. మహ్మద్ ఆసిఫ్ పాషా అనే వ్యక్తితో కలిసి ఈ ఏడాది జూన్‌లో సమీఉద్దీన్ ఎయిర్‌టెల్ సిమ్‌కార్డును బ్లాక్ చేయించాడు. సమీఉద్దీన్ప్రూఫ్తో కొత్తగా సిమ్‌కార్డు తీసుకున్నాడు. తర్వాత ఫోన్‌నంబర్‌కు లింక్‌అయి ఉన్న యూపీఐ అకౌంట్లను యాక్డికవేట్చేశాడు. అలా ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే నుంచి మొత్తం మూడు బ్యాంక్అకౌంట్ల నుంచి రూ.20,18,557 ట్రాన్స్ఫర్చేసుకున్నాడు.
కెడ్రిట్‌కార్డు బిల్లులు సైతం చెల్లించారు. వరుసగా బ్యాంక్అకౌంట్ల నుంచి డబ్బులు పోతుండడంతో సబిహా సుల్తానా కరీంనగర్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో మహ్మద్ ఆసిఫ్ పాషాను గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.18 లక్షల నగదు, సెల్‌ఫోన్, క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. జహంగీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.