- రాష్ర్ట క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్
పద్మారావునగర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ విమర్శించారు. ఆదివారం పద్మారావునగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఇండియా కూటమికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
అయితే దీనిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. పార్లమెంట్ స్థానాల పెంపు పేరుతో మహిళా బిల్లును కాలయాపన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బీజేపీకి మహిళల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని, అయితే దేశ ప్రజలు ఇలాంటి చర్యలకు సహించబోరని హెచ్చరించారు. రాష్ట్రపతికే కనీస గౌరవం ఇవ్వని ప్రభుత్వం, సాధారణ మహిళలకు ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని దీపక్ జాన్ అన్నారు.

