
- ఐఏఎఫ్ ఆధ్వర్యంలో శుభాంశు శుక్లా, ఇతర ఆస్ట్రోనాట్లకు సన్మానం
న్యూఢిల్లీ: గగన్ యాన్ మిషన్ ఆత్మనిర్భర్ భారత్ ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ మిషన్ కు సెలక్ట్ అయిన శుభాంశు శుక్లా, మరో ముగ్గురు గగన్ యాత్రీలు(ఆస్ట్రోనాట్లు) దేశానికి రత్నాలు అని, దేశ ప్రజల ఆకాంక్షలకు వారు మార్గదర్శకులని కొనియాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా యాక్సియం4 మిషన్ లో ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని సుబ్రతో పార్క్ లో ఐఏఎఫ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో గగన్ యాత్రీలు, ఐఏఎఫ్గ్రూప్ కెప్టెన్లు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్లను సన్మానించారు. సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, గగన్ యాత్రీల కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. అంతరిక్షం కేవలం ఒక పరిశోధన వేదికగానే కాకుండా భవిష్యత్తులో మానవాళికి ఎకానమీ, సెక్యూరిటీ, ఎనర్జీ రంగాల్లో కీలకం అవుతుందన్నారు.
భారత్ అంతరిక్ష శోధనలో క్రమంగా ముందడుగు వేస్తోందన్నారు. ‘‘చంద్రుడి నుంచి అంగారకుడి వరకు ఇదివరకే మనదైన ముద్ర వేశాం. ఇప్పుడు గగన్ యాన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాం. గగన్ యాన్ మిషన్తో అంతరిక్ష యానంలో అతికొద్ది దేశాల సరసన నిలవబోతున్నాం. ఇది దేశానికి ఒక కొత్త మైలురాయిగానే కాదు.. ఆత్మనిర్భర్ భారత్ జర్నీలో ఒక కొత్త చాప్టర్ లా నిలుస్తుంది” అని రక్షణ మంత్రి అన్నారు.