ఈ రోజుకు చాలా ప్రత్యేకతలన్న రాజ్ నాథ్: రాఫెల్ కు ఆయుధ పూజ

ఈ రోజుకు చాలా ప్రత్యేకతలన్న రాజ్ నాథ్: రాఫెల్ కు ఆయుధ పూజ

మెరిగ్నాక్: ఫ్రాన్స్ లో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అధికారికంగా స్వీకరించారు. మెరిగ్నాక్ లోని దసాల్ట్ ఏవియేషన్ అసెంబ్లింగ్ యూనిట్ లో రాఫెల్ ఫైటర్ జెట్ ను ఫ్రాన్స్ అందజేసింది. ఆ తర్వాత దానికి రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. దసరా నాడు మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ రాఫెల్ పై పూలు ఉంచి, టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి ఆయుధ పూజ నిర్వహించారు. రాఫెల్ ఫైటర్ జెట్ పై కుంకుమతో ఓం కూడా రాశారు.

రాఫెల్.. దాని పేరు నిలుపుకోవాలి

రాఫెల్ ను అధికారికంగా స్వీకరించిన తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు.

‘నేడు దసరా పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పర్వదినం. అలాగే ఇవాళ భారత వాయుసేన 87వ వ్యవస్థాపక దినోత్సవం (ఐఏఎఫ్ డే). ఇన్ని ప్రత్యేకతలు కలిసొచ్చిన ఈ రోజునే రాఫెల్ ను అందుకోవడం సింబాలిక్ గా కుదిరింది. ఇది చరిత్రాత్మకమైన రోజు. రాఫెల్.. భారత్ – ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలకు కొత్త బాటలు వేసింది’ అని రాజ్ నాథ్ చెప్పారు.

ఫ్రెంచ్ భాషలో రాఫెల్ అంటే ‘సుడిగాలి దెబ్బ’ అని అర్థమని, దాని పేరును సార్థకం చేసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. తొలి రాఫెల్ ను అనుకున్న సమయానికి అందించడం సంతోషంగా ఉందని, దానిలో ప్రయాణించాలని తనకు కోరికగా ఉందని చెప్పారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య అన్ని రంగాల్లోనూ బంధాలు మరింత బలోపేతం కావాలన్నారు.