భారత్-చైనా తాజా ఘర్షణలు : ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

భారత్-చైనా తాజా ఘర్షణలు : ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో, మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. భారత్‌, చైనా సరిహద్దు వివాదంపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు.. రాజ్యసభలో రూల్ 267 కింద సస్పెన్షన్‌ ఆఫ్‌ బిజినెస్‌ నోటీసులు ఇచ్చారు. సరిహద్దు ఘర్షణలపై ప్రధాని నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనలు చేయాలని తమ నోటీసుల్లో డిమాండ్‌ చేశారు.

బార్డర్ దాటొచ్చిన చైనా సైనికులను భారత జవాన్లు దీటుగా అడ్డుకోవడంతో ఇండో– చైనా బార్డర్ లో ఫైటింగ్ చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద గత శుక్రవారం ఈ గొడవ జరిగినట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ గొడవలో ఇరువైపులా కొంతమంది జవాన్లకు స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే అక్కడి నుంచి ఇరువైపులా బలగాలు వెనక్కి మళ్లాయని తెలిపాయి. ఘర్షణ అనంతరం బార్డర్ లో శాంతిని నెలకొల్పేందుకు ఉన్న మెకానిజం ప్రకారం.. చైనీస్ కమాండర్ తో తవాంగ్ సెక్టార్ లోని ఇండియన్ ఆర్మీ కమాండర్ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, చర్చలు జరిపినట్లు పేర్కొన్నాయి. 

రెండేండ్ల కిందట (2020, జూన్ లో) తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన గొడవ తర్వాత బార్డర్ లో టెన్షన్ నెలకొనడం మళ్లీ ఇదే మొదటిసారి. గల్వాన్ గొడవలో మన జవాన్లు 20 మంది చనిపోయారు. తమవైపు ఎంత మంది చనిపోయారని చైనా చెప్పకపోయినా.. దాదాపు 40 మందికిపైగానే మృతిచెంది ఉంటారన్న వార్తలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య మిలిటరీ కమాండర్ల స్థాయిలో అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. లడఖ్ లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏరియాలోని కీలక పాయింట్ల నుంచి ఇరువైపులా బలగాలు వెనక్కి మళ్లాయి.